Independence Day 2024: లైవ్ అప్‌డేట్స్.. దేశ వ్యాప్తంగా అంబరాన్నంటిన మువ్వన్నెల సంబురాలు
Independence Day 2024 Live Updates: 78వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు దేశ వ్యాప్తంగా గ్రాండ్‌గా జరుగుతున్నాయి.
Independence Day 2024 Live Updates: 78వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు దేశ వ్యాప్తంగా గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు ప్రధాని మోడీ. ఈ కార్యక్రమానికి సుమారు 6,000 మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ఈ ఏడాది ఎర్రకోటలో జరిగే వేడుకలను చూసేందుకు యువకులు, గిరిజనులు, రైతులు, మహిళా వర్గాలతో పాటు ఇతర ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. అంతేకాదు వివిధ రంగాలకు చెందిన, వివిధ రంగాలలో రాణించిన వారిని వేడుకలకు ఆహ్వానించారు.
గత ప్రభుత్వం అనర్హులకు రైతు భరోసాను అందించిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. సన్నరకం వరి సాగును ప్రోత్సహించేందుకు రూ.500 బోనస్ చెల్లి్స్తామన్నారు. రూ. 500 బోనస్ కు 33 వరిధాన్యాలను గుర్తించినట్టుగా ఆయన చెప్పారు. పెండింగ్ ధరణి ధరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించారు. భూసమస్యల పరిష్కారానికి సమగ్రచట్టం తీసుకురావాలని భావిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. ధరణిలో ఎన్నో లోపాలను గుర్తించామన్నారు.
రుణమాఫీపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రుణమాఫీ కాని లబ్దిదారుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్టుగా ఆయన తెలిపారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. వరంగల్ డిక్లరేషన్ అమల్లో భాగంగా రుణమాఫీ చేస్తున్నామన్నారు. రుణమాఫీ అసాధ్యమని కొందరు వక్రభాష్యం చెప్పారని ఆయన పరోక్షంగా బీఆర్ఎస్ నాయకుల విమర్శలను ప్రస్తావించారు. రూ. 2 లక్షల వరకు రుణమాఫీని చేసి చూపిస్తున్నామని ఆయన చెప్పారు. రుణమాఫీపై విపక్షాలు రంధ్రాన్వేషణ చేస్తున్నాయన్నారు.
రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. త్వరలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. రూ. 500లకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. 43 లక్షల మందికి రూ. 500లకే గ్యాస్ సిలిండర్ తో లబ్ది కలుగుతుందన్నారు సీఎం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. భద్రాద్రి సీతారాముడి సాక్షిగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో 4 లక్షల ఇళ్ళను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. త్వరలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.
తెలంగాణ ఇస్తామని సోనియాగాంధీ కరీంనగర్ లో మాటిచ్చారని...ఈ మాట ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మాట ఇస్తే అమలు చేస్తారని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ద్వారా కాంగ్రెస్ నిరూపించిందని ఆయన చెప్పారు.
దశాబ్దకాలం తర్వాత నిజమైన ప్రజా పాలన తెలంగాణలో ప్రారంభమైందని ఆయన చెప్పారు. తొలిసారిగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్దమైన పాలన సాగుతోందన్నారు. ప్రజల స్వేచ్ఛను పునరుద్దరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.
పాలనలో లోటుపాట్లుంటే సూచనలు ఇచ్చేలా చేశామన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నా సంయమనం పాటిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. ప్రజా పాలన మొదలయ్యాక కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. పదేళ్లపాటు రాష్ట్ర గీతం లేకుండా పాలన చేశారన్నారు. జయజయహే తెలంగాణను రాష్ట్ర గీతంగా ప్రకటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. నెహ్రూ దార్శనికత ఫలితంగానే దేశం ఈ స్థాయిలో నిలిచిందన్నారు. పంచవర్ష ప్రణాళికలతో దేశాన్ని అభివృద్ది వైపునకు నడిపించడంలో ఆయన ముందున్నారన్నారు. నెహ్రూ ప్రారంభించిన ప్రాజెక్టులతో దేశం సస్యశ్యామలంగా ఉందని ఆయన చెప్పారు. బీహెచ్ఈఎల్, మిధాని వంటి పరిశ్రమలను నెహ్రూ స్థాపించారన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీలు సాగులో విప్లవం తెచ్చారని ఆయన గుర్తు చేశారు.
విభజన కంటే రివర్స్ పాలనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని చంద్రబాబు చెప్పారు. గత ప్రభుత్వ అసమర్ధ విధానాలతో రాష్ట్రం అప్పులు రూ. 9 లక్షల 74వేల కోట్లకు చేరుకున్నాయన్నారు. రూ. 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని దేశం దృష్టిని ఆకర్షించినట్టుగా ఆయన చెప్పారు. గత ఐదేళ్లలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ ను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. బాధ్యతలు చేపట్టిన రోజే ఐదు సంతకాలు పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గత ఐదేళ్లలో ప్రజల కష్టాలను చూసి మేనిఫెస్టో రూపకల్పన చేసినట్టుగా తెలిపారు. బాధ్యతలు చేపట్టిన రోజునే మెగా డీఎస్సీపై సంతకం చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ సీఎం వైఎస్ జగన్.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండలి ప్రతిపక్ష నేత లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు, వైసీపీ నేతలు పాల్గొన్నారు.
గత ఐదేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం లక్షల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన పాలకులు విధ్వంసం సృష్టించారన్నారు. బాధితులనే నిందితులుగా చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని చంద్రబాబు విమర్శించారు. నియంత పోకడలు, పరదాల పాలనతో రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వ భూములు, ఆస్తులను దోచుకున్నారన్నారు. ప్రశ్నిస్తే దాడులు, కేసులు, అరెస్టులతో వేధించారని చెప్పారు. ప్రజావేదిక ధ్వంసంతో నాటి పాలనను జగన్ ప్రారంభించారన్నారు. నాటి విధ‌్వంసపాలనలో సంపద సృష్టి లేదన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టుగా చంద్రబాబు చెప్పారు. ఈ ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించామన్నారు. 2019 ఎన్నికలనాటికి పోలవరం ప్రాజెక్టు 73 శాతం పనులు పూర్తి చేసినట్టుగా ఆయన చెప్పారు. గత ఐదేళ్లు తమ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ దేశంలోనే టాప్ లో నిలిచిందని చంద్రబాబు చెప్పారు. రూ. 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని దేశం దృష్టిని ఆకర్షించామన్నారు. రాజధాని లేని రాష్ట్రమని బాధగా కూర్చోలేదని చెప్పారు. సంక్షోభాలను అవకాలుగా మలుచుకున్నట్టుగా ఆయన తెలిపారు. దేశం గర్వించే రాజధానికి శంకుస్థాపన చేసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.