Top 6 News @ 6PM: ఫార్ములా ఈ కార్ రేసింగ్ అవినీతి కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హై కోర్టు ఆదేశాలు
1) Formula E Race: ఫార్మూలా ఈ కారు రేసులో తెలంగాణ హైకోర్టులో శుక్రవారం ఊరట లభించింది. డిసెంబర్ 30 వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ఏసీబీ దర్యాప్తును కొనసాగించేందుకు కూడా కోర్టు అనుమతించింది. ఈ నెల ౩౦ లోపుగా కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశించింది కోర్టు.
తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో డిసెంబర్ 20న లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై శుక్రవారం మధ్యాహ్నం హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ఈ నెల 30 వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
2) బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సైలెంట్‌గా ఉండమనండి.. లేదా సస్పెండ్ చేయండి - అక్బరుద్దీన్
Akbaruddin Owaisi comments on BRS party and losses due to Dharani portal: తెలంగాణ అసెంబ్లీ సనావేశాల్లో ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ధరణి వల్ల తెలంగాణ రాష్ట్రం కొన్ని వేల కోట్లు నష్టపోయిందన్నారు. రైతులు వేల ఎకరాల భూములు కోల్పోయారని అన్నారు. అసైన్డ్ భూములు పోయాయి. అటవీ శాఖ భూములు గల్లంతయ్యాయి అని అక్బరుద్దీన్ ఆరోపించారు.
ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఆ సమస్యలను సవరించే ప్రయత్నం చేస్తోందని ఆయన చెప్పారు. ఈ సవరణల్లో కూడా ఇంకా సవరించాల్సిన అంశాలున్నాయని గుర్తుచేస్తూ వాటిని తాము ఈ సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. కానీ బీఆర్ఎస్ పార్టీ సభను సజావుగా సాగనివ్వకుండా ఆటంకం కలిగిస్తూ తమకు అడ్డుపడుతోందన్నారు. సభ జరగకుండా అడ్డం పడుతోన్న వారిని అడ్డం రాకుండా రిక్వెస్ట్ అయినా చేయండి.. లేదంటే వారిని సభ నుండి సస్పెండ్ చేయండి అని అక్బరుద్దీన్ ఒవైసి స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను ( TG Speaker Gaddam Prasad ) కోరారు.
3) Chandrababu Naidu- కబ్జా చేస్తే తాట తీస్తాం... ల్యాండ్ గ్రాబర్స్‌కు చంద్రబాబు హెచ్చరికలు
ఇకపై ఎవరైనా సెంటు భూమి కబ్జా చేసినా సరే వారి తాట తీస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ల్యాండ్ గ్రాబర్స్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఇతరుల భూములు కబ్జాలు చేయడం, మోసాలకు పాల్పడటం, బెదిరింపులకు దిగడం చేస్తే వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. కృష్ణా జిల్లా ఈడ్పుగల్లులో జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొని మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో తప్పుడు సర్వేలు జరిగాయని భారీ సంఖ్యలో జనం ఫిర్యాదు చేశారు. అందుకే ఇకపై ఎవ్వరూ ఇతరుల భూములు కబ్జా చేయకుండా కొత్త చట్టం తీసుకొచ్చామని చెబుతూ ఆయన ఈ హెచ్చరికలు చేశారు.
4) AP Weather Report: వాయుగుండంగా అల్పపీడనం.. ఆ 7 జిల్లాలకు భారీ వర్ష సూచన
AP Weather Report: ఉత్తర కోస్తాకు మరోసారి భారీ వర్షాల ముప్పు తప్పేలా లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ వాయుగుండం కారణంగా విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
రాబోయే రెండు రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీచేశారు. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా అధికారులు సూచించారు.
5) Om Prakash Chautala's Death News: ఓం ప్రకాశ్ చౌతాలా ఇక లేరు
Om Prakash Chautala's Death News: హర్యానా మాజీ సీఎం, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ (INLD) అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా ఇక లేరు. గురుగ్రామ్ లోని తన సొంత నివాసంలో శుక్రవారం మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 89 ఏళ్లు. శుక్రవారం ఉదయం వరకు ఆరోగ్యంగానే ఉన్న ఆయన ఉన్నట్లుండి గుండెపోటుతో కన్నుమూశారు. ఐఎన్ఎల్‌డి అధికార ప్రతినిధి రాకేష్ సిహాగ్ మీడియాతో మాట్లాడుతూ... చౌతాలకు గుండెపోటు వచ్చిందని, ఆ నొప్పితోనే ఆయన వెక్కిళ్లబారినపడి కన్నుమూశారని అన్నారు. ఓం ప్రకాష్ చౌతాలా హర్యానాకు ఐదుసార్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. భారత మాజీ ఉప ప్రధాని దేవీ లాల్ తనయుడే ఈ ఓం ప్రకాష్ చౌతాలా.
6) Donald Trump threatens Europe: అమెరికా వద్ద ఆయిల్, గ్యాస్ కొనండి.. లేదంటే... ట్రంప్ వార్నింగ్
Donald Trump threatens Europe: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ యురొపియన్ యూనియన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా వద్ద ఆయిల్, గ్యాస్ కొనండి... లేదంటే అమెరికా వైపు నుండి అన్నివిధాలుగా సుంకం రూపంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సుంకం అనే మాటను హైలైట్ చేస్తూ ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో ట్రంప్ ఒక పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
యురోపియన్ యూనియన్‌లో ప్రస్తుతం 27 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, స్వీడన్, ఇటలీ, నెదర్లాండ్స్, పోలాండ్, పోర్చుగల్, ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, డెన్మార్క్, ఎస్టోనియా, ఫిన్లాండ్, గ్రీస్, క్రొయేషియా, సైప్రస్, చెక్ రిపబ్లిక్, హంగేరీ, ఐర్లాండ్, లాట్వియా, లిత్వేనియా, లక్సెంబర్గ్, మాల్టా, రొమేనియా, స్లోవేనియా వంటి దేశాలు ఆ జాబితాలో ఉన్నాయి. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.