Om Prakash Chautala's Death News: హర్యానా మాజీ సీఎం, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ (INLD) అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా ఇక లేరు. గురుగ్రామ్ లోని తన సొంత నివాసంలో శుక్రవారం మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 89 ఏళ్లు. శుక్రవారం ఉదయం వరకు ఆరోగ్యంగానే ఉన్న ఆయన ఉన్నట్లుండి గుండెపోటుతో కన్నుమూశారు.
ఐఎన్ఎల్‌డి అధికార ప్రతినిధి రాకేష్ సిహాగ్ మీడియాతో మాట్లాడుతూ... చౌతాలకు గుండెపోటు వచ్చిందని, ఆ నొప్పితోనే ఆయన వెక్కిళ్లబారినపడి కన్నుమూశారని అన్నారు. ఓం ప్రకాష్ చౌతాలా హర్యానాకు ఐదుసార్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. భారత మాజీ ఉప ప్రధాని దేవీ లాల్ తనయుడే ఈ ఓం ప్రకాష్ చౌతాలా.
హర్యానాలోని సిర్సా జిల్లా తేజా ఖేడాలో శనివారం మధ్యాహ్నం తరువాత ఓం ప్రకాష్ చౌతాలా అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఓం ప్రకాష్ సింగ్ చౌతాలకు అజయ్ సింగ్ చౌతాలా, అభయ్ సింగ్ చౌతాలా అని ఇద్దరు కుమారులున్నారు. మరో ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల సందర్శనార్థం అక్కడే చౌతాలా పార్థివదేహాన్ని ఉంచనున్నట్లు వారు చెప్పారు.