Mumbai: ఘోరప్రమాదం..ముంబై బోట్ ప్రమాదంలో 13 మంది దుర్మరణం: సీఎం ఫడ్నవీస్
Mumbai: ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. బోట్ ప్రమాదంలో 13 మంది మరణించినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. 101 మంది కాపాడినట్లు ఆయన వెల్లడించారు. గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా దీవులకు పర్యాటకులతో వెళ్తున్న ఫెర్రీ బోట్ ను స్పీడ్ బోట్ వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 13 మంది మరణించినట్లు సీఎం ప్రకటించారు.
మహారాష్ట్రలోని ముంబై తీరానికి సమీపంలో బుధవారం నేవీ స్పీడ్ బోట్ ఢీకొనడంతో ప్రయాణికులతో కూడిన పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ప్రయాణీకుల బోటులో 10 మంది, నేవీ స్పీడ్ బోట్‌లోని ముగ్గురు మరణించారు. 'నీల్కమల్ ఫెర్రీ' అనే ప్యాసింజర్ బోట్‌లో సిబ్బందితో సహా మొత్తం 110 మంది ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి మొత్తం 101 మందిని రక్షించారు.
ప్రయాణికులతో వెళ్తున్న బోటు యజమాని రాజేంద్ర పేట్ తన బోటును స్పీడ్ బోట్ ఢీకొట్టిందని ఆరోపించారు. తన పడవలో మొత్తం 84 మంది ప్రయాణించవచ్చని, అందులో 80 మంది ఉన్నారని తెలిపారు. అయితే బోటులో 100 మందికి పైగా ఉన్నట్లు ఆ తర్వాత విషయం బటయకు వచ్చింది.ప్రమాదం జరిగిన సమయంలో నీల్కమల్ అనే బోటు ముంబైకి సమీపంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన 'ఎలిఫెంటా' ద్వీపానికి వెళ్తుండగా సాయంత్రం 4 గంటల సమయంలో నేవీ స్పీడ్ బోట్ ఢీకొట్టిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. స్పీడ్‌బోట్ డ్రైవర్ అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ప్రయాణీకుల బోటును స్పీడ్ బోట్ ఢీకొట్టినట్లు సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. నివేదికల ప్రకారం, మొత్తం 110 మందిలో 101 మందిని రక్షించారు. 10 మంది పౌరులు, 3 నావికులు మరణించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.