Top 6 News @ 6PM: పురుటి నొప్పులతో గ్రూప్-2 పరీక్ష రాసిన అభ్యర్ధిని: మరో 5 ముఖ్యాంశాలు
నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం బాణాల గ్రామానికి చెందిన రేవతి పురుటి నొప్పులతో గ్రూప్ -2 పరీక్ష రాశారు.
1. పురుటి నొప్పులతో గ్రూప్-2 పరీక్ష రాసిన రేవతి
నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం బాణాల గ్రామానికి చెందిన రేవతి పురుటి నొప్పులతో గ్రూప్ -2 పరీక్ష రాశారు. నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ స్కూల్ లో సోమవారం ఆమె పరీక్ష రాసేందుకు వెళ్లారు. పరీక్ష కేంద్రానికి వెళ్లిన సమయంలో ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. తాను పరీక్ష రాస్తానని ఆమె మొండికేశారు. పరీక్ష కేంద్రం సిబ్బంది జిల్లా కలెక్టర్ కు సమాచారం ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాలతో 108 పరీక్ష కేంద్రం వద్ద సిద్దంగా ఉంచారు. పురుటి నొప్పులతోనే ఆమె పరీక్ష రాశారు.
2. ప్రభాస్ కాలికి గాయం..కల్కి ప్రమోషన్ కు దూరం
ప్రభాస్ కాలుకు గాయమైంది. సినిమా షూటింగ్ లో కాలు బెణికింది. వైద్యులు ఆయనను విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో కల్కి సినిమా ప్రమోషన్లకు ప్రభాస్ హాజరుకావడం లేదు. డిస్ట్రిబ్యూటర్ల టీమ్ ప్రమోషన్లలో పాల్గొంటారు. వాస్తవానికి ప్రభాస్ కల్కి ప్రమోషన్లో పాల్గొనాలి. జనవరి 3న కల్కి సినిమా జపాన్ లో విడుదల చేస్తున్నారు. కాలి గాయంతో తాను కల్కి ప్రమోషన్ లో పాల్గొనడం లేదని తనను క్షమించాలని ప్రభాస్ చెప్పినట్టుగా ఉన్న పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
3. 2026 అక్టోబర్ కు పోలవరం పూర్తి: చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టును 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రం వాల్ పూర్తి కావాలని అధికారులను ఆదేశించినట్టు ఆయన తెలిపారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం పూర్తైతే 7.20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందన్నారు. 28 లక్షల మందికి తాగునీరు 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని ఆయన అన్నారు.
4. రామేశ్వరం- శ్రీలంక మధ్య ఫెర్రీ సర్వీసులు
తమిళనాడులోని రామేశ్వరం- శ్రీలంకలోని తలైమన్నార్ ల మధ్య ఫెర్రీ సర్వీసులు ప్రారంభించాలని నిర్ణయించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకేతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తమిళుల ఆకాంక్షలను శ్రీలంక నెరవేరుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ సహకారానికి సంబంధించిన ఒప్పందానికి త్వరలోనే తుది రూపం ఇచ్చేందుకు అంగీకరించామని ఆయన తెలిపారు. శ్రీలంక అధ్యక్షుడు భారత్ లో పర్యటిస్తున్నారు. రెండు దేశాల మధ్య కీలక అంశాలపై చర్చించారు.
5. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం సమావేశమయ్యారు. నామినేటేడ్ పదవుల విషయమై చర్చించారు. రాజ్యసభ పదవిని నాగబాబుకు ఇవ్వాలని జనసేన నాయకత్వం కోరింది. ఆర్. కృష్ణయ్యను బీజేపీ రంగంలోకి దింపడంతో జనసేనకు చెందిన నాగబాబుకు ఈ సీటు దక్కలేదు. అయితే చంద్రబాబు మంత్రివర్గంలోకి నాగబాబును తీసుకుంటామని టీడీపీ ప్రకటించింది. ఈ విషయమై ఈ ఇద్దరి మధ్య చర్చ జరిగింది.
6. బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్, ఎంఐఎం వాకౌట్
తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్, ఎంఐఎం సోమవారం వాకౌట్ చేశాయి. తెలంగాణ అసెంబ్లీ టీ బ్రేక్ కోసం వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించారు. బీఏసీ సమావేశంలో కనీసం 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్,ఎంఐఎం డిమాండ్ చేశాయి. ఏయే అంశాలు సభలో చర్చిస్తారనే విషయమై ప్రభుత్వాన్ని ఈ రెండు పార్టీలు కోరాయి. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదని బీఆర్ఎస్ చెబుతోంది. సభ ఎన్ని రోజులు నిర్వహించే అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాని కారణంగానే తాము బీఏసీ నుంచి వాకౌట్ చేశామని బీఆర్ఎస్, ఎంఐఎం చెబుతున్నాయి. గంట సేపు సమావేశం నిర్వహించినా కూడా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.