Priyanka Gandhi: పాలస్తీనా బ్యాగ్ తో పార్లమెంట్ కు
పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగ్‌తో ప్రియాంక రావడంపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ ఒక వర్గాన్ని బుజ్జగించే పనిలో ఉందని.. అందుకే ఎన్నికల్లో అలాంటి ఫలితాలు వచ్చాయని విమర్శించారు
Priyanka Gandhi: పాలస్తీనా బ్యాగ్ తో పార్లమెంట్ కు
ప్రియాంక గాంధీ పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగ్‌తో లోక్ సభకు హాజరు కావడం విమర్శలు దారితీసింది. ఆ బ్యాగ్ పై పుచ్చకాయ, శాంతి చిహ్నాలు ఉన్నాయి. ప్రియాంక గాంధీ తీసుకెళ్లిన ప్రత్యేక బ్యాగ్ పాలస్తీనాకు ఆమె మద్దతు, సంఘీభావాన్ని చూపుతోందని.. కరుణ, న్యాయం, మానవత్వం పట్ల నిబద్ధతకు ఇది చిహ్నమంటూ దానికి సంబంధించిన ఫొటోను.. కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మహమ్మద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పార్లమెంట్ ఆవరణలో ప్రియాంక గాంధీ ఆ బ్యాగ్‌తో దిగిన ఫొటో నెట్టింట వైరల్ గా మారింది.
అయితే పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగ్‌తో ప్రియాంక రావడంపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ ఒక వర్గాన్ని బుజ్జగించే పనిలో ఉందని.. అందుకే ఎన్నికల్లో అలాంటి ఫలితాలు వచ్చాయని విమర్శించారు. అంతకు ముందు రోజు పాలస్తీనా రాయబారి అబు జాజర్‌తో ప్రియాంక సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పాలస్తీనా స్కార్ఫ్‌తో కనిపించారు ప్రియాంక. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో కేరళ వయనాడ్ నుంచి ఎంపీగా గెలిచినందుకు అబు జాజర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాలస్తీనాలో జరుగుతున్న ఘర్షణను తగ్గించేందుకు భారత్ ముఖ్య భూమిక పోషించాలని ఆయన అన్నారు. ముందు నుంచి పాలస్తీనాకు మద్దతు ఇస్తూ వస్తున్న ప్రియాంక గాంధీ.. తాజాగా పాలస్తీనా బ్యాగ్‌తో పార్లమెంటులో కనిపించడం అందరినీ ఆకర్షించింది. అదే సమయంలో బీజేపీ నుంచి విమర్శలకు కూడా దారి తీసింది.