Top 6 News @ 6PM: జర్నలిస్టుపై దాడి ఘటనపై మరోసారి వివరణ ఇచ్చిన మోహన్ బాబు, మంచు విష్ణు
1) TGPSC Group2 Exams: ముగిసిన తొలి రోజు గ్రూప్ 2 పరీక్షలు
TGPSC Group2 Exams: తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల్లో భాగంగా మొదటి రోజు పరీక్షలు ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1368 కేంద్రాల్లో టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించింది. రోజూ రెండు సెషన్స్‌లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 2022 డిసెంబర్ 29న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా 783 పోస్టులు భర్తీ చేయనున్నారు. గ్రూప్ 2 పరీక్షలకు 5,55943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రేపు సోమవారంతో గ్రూప్ 2 పరీక్షలు ముగుస్తాయి.
2) Vangalapudi Anitha: సినిమాల నుండి చెడే ఎక్కువగా నేర్చుకుంటున్నారు
AP Home Minister Vangalapudi Anitha: నేటి యువతను ఉద్దేశించి ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. యువత సినిమాల నుండి మంచి కంటే చెడే ఎక్కువగా నేర్చుకుంటోందన్నారు. సమాజంలో ఆడబిడ్డలకు రక్షణ అందించినప్పుడే అసలైన హీరోలు అని అనిపించుకుంటారని అభిప్రాయపడ్డారు. యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని అన్నారు.
ఆడబిడ్డలను రక్షించుకుందాం... సమాజాన్ని కాపాడుకుందాం అని అనిత పిలుపునిచ్చారు. సేవ్ ది గర్ల్ చైల్డ్ పేరుతో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
3) Mohan Babu attack on Media: జర్నలిస్టును కావాలని కొట్టలేదు - మోహన్ బాబు, మంచు విష్ణు
జల్‌పల్లి ఫామ్ హౌజ్ వద్ద జరిగిన దాడి ఘటనలో తన చేతిలో గాయపడిన జర్నలిస్టును మోహన్ బాబు పరామర్శించారు. ఆదివారం మోహన్ బాబు, మంచు విష్ణు సోమాజీగూడలోని యశోదా ఆస్పత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న జర్నలిస్టును కలిశారు. జర్నలిస్టుకు, వారి కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. తాను జర్నలిస్టును కొట్టడం అనేది ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి కాదని అన్నారు. జర్నలిస్టుపై దాడి ఘటనపై మోహన్ బాబు, మంచు విష్ణు వివరణ ఇవ్వడం ఇది రెండోసారి.
4) మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ లేటెస్ట్ అప్‌డేట్స్
మహారాష్ట్రలో ఉత్కంఠరేపిన కేబినెట్ విస్తరణ ప్రక్రియ ప్రస్తుతానికి పూర్తయింది. 39 మంది కొత్త మంత్రులు ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. వారిలో 20 మంది ఎమ్మెల్యేలు బీజేపి నుండి ఉన్నారు. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీకి చెందిన 11 మందికి కేబినెట్ లో చోటు దక్కింది. ఇక అజిత్ పవార్ వర్గం నుండి 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
కీలకమైన మంత్రి పదవుల కేటాయింపుల్లో బీజేపికి హోంశాఖ, రెవిన్యూ శాఖ దక్కాయి. శివసేన పార్టీ వైద్య ఆరోగ్య శాఖ, రవాణా శాఖ పోర్ట్ పోలియో తీసుకుంది. అజిత్ పవర్ వర్గాన్ని ఆర్థిక శాఖ మంత్రి పదవి వరించింది.
5) Ind vs Aus 3rd Test: 5 వికెట్స్ తీసిన జస్‌ప్రీత్ బుమ్రా.. సెంచరీలతో చెలరేగిన ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్
Ind vs Aus 3rd Test Day 2 match Highlights: బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆటలో ఆసిస్ ఆటగాళ్లు చెలరేగిపోయారు. ట్రావిస్ హెడ్ కొట్టిన 152 పరుగుల సెంచరీ ఆస్ట్రేలియాను ఆధిక్యంలో నిలబెట్టింది. స్టీవ్ స్మిత్ కూడా సెంచరీతో ట్రావిస్ హెడ్‌కు మంచి పార్ట్‌నర్‌షిప్ అందించాడు. దీంతో మూడో వికెట్ నష్టపోయేటప్పటికీ 77 పరుగుల వద్ద ఉన్న స్కోర్‌ను 4వ వికెట్ నష్టపోయేటప్పటికి 326 పరుగులకు చేర్చారు.
జస్‌ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీసుకుని ఔరా అనిపించినప్పటికీ.. ఆసిస్ ఆటగాళ్ల స్కోర్ బోర్డ్ ముందు అది చిన్నబోయింది. బుమ్రా మొదట ఓపెనర్లు ఉస్మాన్ ఖ్వాజ, నాథన్ మెక్ స్వీనేల వికెట్స్ పడగొట్టాడు. అలాగే సెంచరీలతో ఊపు మీదున్న ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్‌ను కూడా పెవిలియన్‌కు చేర్చాడు. మిచెల్ మార్ష్ వికెట్‌తో కలిపి మొత్తం 5 వికెట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆలస్యంగా బ్యాటింగ్‌కు వచ్చిన అలెక్స్ కేరీ కూడా 44 పరుగులు బాదాడు. దాంతో ఆస్ట్రేలియా స్కోర్ బోర్డ్ 400 మార్క్ దాటి మొత్తం 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది.
6) చిరంజీవి ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్
Allu Arjun meets Chiranjeevi: అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. నిన్న ఉదయం చంచల్ గూడ జైలు నుండి రిలీజ్ అయిన తరువాత అల్లు అర్జున్ చిరంజీవివి కలవడం ఇదే మొదటిసారి. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో డిసెంబర్ 13న అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.
అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారన్న విషయం తెలుసుకున్న చిరంజీవి తన సినిమా క్యాన్సిల్ చేసుకుని హుటాహుటిన భార్య సురేఖతో కలిసి అల్లు అరవింద్ ఇంటికి వెళ్లారు. అల్లు అర్జున్ కు ఏమీ కాదని అరవింద్ కుటుంబానికి ధైర్యం చెప్పారు. నాగబాబు కూడా వారిని కలిసి పరామర్శించారు. అందుకు కృతజ్ఞతగానే అల్లు అర్జున్ ఇవాళ చిరంజీవి ఇంటికి వెళ్లి కలిశారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన తీరుపై ఇద్దరూ కాసేపు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోర్టులో జరుగుతున్న న్యాయపోరాటంపైనా వారి మధ్య చర్చ జరిగినట్లు టాక్.