Maharashtra Cabinet: ఢిల్లీలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.. ఏ పార్టీకి ఎన్ని శాఖలంటే..
Maharashtra Cabinet: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజుల పాటు దేశ రాజధానిలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన హస్తినకు వెళ్లడం ఇదే తొలిసారి. ఢిల్లీ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్, ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలవనున్నారు. అలాగే కేంద్ర హోమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమై మంత్రి వర్గ విస్తరణపై చర్చించనున్నారు. ఈ సమావేశంలోనే కేబినెట్ ఎక్స్‌పాన్షన్ ప్లాన్స్‌పై అధిష్టానం నుండి ఆమోదం పొందనున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 14వ తేదీన మహారాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది. మంత్రివర్గంలో గరిష్టంగా 43 బెర్తులకు గాను ముఖ్యమంత్రితో కలిపి బీజేపీకి 21 మంత్రి పదవులు లభించే అవకాశం ఉంది. ఇక శివసేనకు 12, ఎన్సీపీకి 10 కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే.. తమకు హోంశాఖ, రెవెన్యూ శాఖ ఇవ్వాలని పట్టుబట్టిందని.. అయితే ఆ శాఖలకు బదులు మున్సిపల్ మంత్రిత్వ శాఖలను కేటాయించే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం.
ఈనెల 5వ తేదీన మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, ఉపముఖ్యమంత్రులుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రివర్గ విస్తరణ కొలిక్కి రావడంతో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అధిష్టానంతో చర్చించి గ్రీన్ సిగ్నల్ తీసుకోనున్నారు.