Top 6 News @ 6PM: తొక్కిసలాట అనుకోకుండా జరిగింది.. అల్లు అర్జున్: మరో 5 ముఖ్యాంశాలు

సంధ్య థియేటర్ (Sandhya theatre) తొక్కిసలాట ఘటనలో మరణించిన రేవతి (Revathi) కుటుంబానికి అల్లు అర్జున్ (allu arjun) క్షమాపణలు చెప్పారు.

Update: 2024-12-14 12:30 GMT

Top 6 News @ 6PM: తొక్కిసలాట అనుకోకుండా జరిగింది.. అల్లు అర్జున్: మరో 5 ముఖ్యాంశాలు

1. సంధ్య థియేటర్ తొక్కిసలాట అనుకోకుండా జరిగింది: అల్లు అర్జున్

సంధ్య థియేటర్ (Sandhya theatre) తొక్కిసలాట ఘటనలో మరణించిన రేవతి (Revathi) కుటుంబానికి అల్లు అర్జున్ (allu arjun) క్షమాపణలు చెప్పారు. శనివారం ఉదయం ఆయన చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత ఆయన నేరుగా గీత ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే న్యాయవాదులతో కొద్దిసేపు మాట్లాడారు. అక్కడి నుంచి ఇంటికి వెళ్లారు. అల్లు అర్జున్ ఇంటికి సినీ రంగ ప్రముఖలు వచ్చి ఆయనను పరామర్శించారు. తనకు అండగా నిలిచినవారికి అల్లు అర్జున్ ధన్యవాదాలు చెప్పారు. తాను సినిమా చూస్తున్న సమయంలో బయట ఈ ఘటన జరిగిందని ఆయన అన్నారు. ఇది అనుకోకుండా జరిగిందన్నారు. దీనికి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని ఆయన తెలిపారు. అంతకు ముందు గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద కూడా ఆయన మీడియాతో మాట్లాడారు. చట్టాన్ని గౌరవిస్తానని ఆయన చెప్పారు. కోర్టులో కేసు ఉన్నందున తాను ఆ విషయంపై మాట్లాడనని ఆయన అన్నారు.

2. అద్వానీకి అస్వస్థత: ఆసుపత్రిలో చేరిక

బీజేపీ అగ్రనేత అద్వానీ అస్వస్థతకు గురయ్యారు.ఆయనను కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు.ఆయన వయస్సు 97 ఏళ్లు. రెండు రోజుల క్రితమే ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. వృద్దాప్య సమస్యలతో ఆయనకు ఆరోగ్య సమస్యలు వచ్చాయి. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. బీజేపీలో పలు హోదాల్లో పనిచేశారు. వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన డిప్యూటీ పీఎంగా కొనసాగారు.

3. రాజకీయ, అధికార నియామకాల్లో మాదిగలకు ప్రాధాన్యం: రేవంత్ రెడ్డి

రాజకీయ, అధికార నియామకాల్లో మాదిగలకు ప్రాధాన్యం ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. శనివారం హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ మాదిగ డే-2024 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఓయూ వీసీగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నియమించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వారం రోజుల్లో షమీమ్ అక్తర్ కమిషన్ నివేదిక వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. చేవేళ్ల డిక్లరేషన్ ద్వారా ఎస్సీ వర్గీకరణపై తమ పార్టీ వైఖరిని మల్లికార్జున ఖర్గే వెల్లడించారన్నారు.

4. దక్షిణ కొరియా అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానానికి ఆమోదం

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ పై నేషనల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి మరోసారి ఓటింగ్ నిర్వహించారు. తాజాగా నిర్వహించిన ఓటింగ్ లో యోల్ కు ఎదురుదెబ్బ తగిలింది. 204-85 ఓట్ల తేడాతో జాతీయ అసెంబ్లీ ఈ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ ఓటింగ్ తో అధ్యక్షుడి అధికారాలకు కోత పడే అవకాశం ఉంది. దక్షిణ కొరియా నేషనల్ అసెంబ్లీలో 300 మంది సభ్యులున్నారు.అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఆమోదించిన తీర్మానం పత్రాలను రాజ్యాంగం ప్రకారం న్యాయస్థానానికి పంపుతారు. దీన్ని పరిశీలించేందుకు కోర్టుకు 180 రోజుల గడువు ఉంటుంది.

5. శంభు సరిహద్దులో ఉద్రిక్తత: బాష్పవాయువు ప్రయోగం

పంజాబ్-హర్యానా సరిహద్దు శంభు(Shambhu) వద్ద శనివారం మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. దిల్లీ చలో మార్చ్ (delhi chalo foot march)ను రైతులు ప్రారంభించారు. రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. కనీస మద్దతు ధర సహా 11 డిమాండ్లను రైతులు కేంద్రం ముందు పెట్టారు. డిసెంబర్ 6 నుంచి చలో దిల్లీకి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రకరకాల కారణాలతో తమ యాత్రను వాయిదా వేసుకున్నారు.

6. రాజధానిలో మరో 20 వేల కోట్ల అభివృద్ది పనులు: నారాయణ

అమరావతిలో మరో రూ. 20 వేల కోట్లతో అభివృద్ది పనులకు డిసెంబర్ 16న సీఆర్ డీ ఏ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ చెప్పారు. సీడ్ క్యాపిటల్ నుంచి జాతీయ రహదారికి అనుసంధానం కానున్న రోడ్లను ఆయన పరిశీలించారు. వచ్చే 30 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.

Tags:    

Similar News