Jammu Kashmir: జమ్మూకశ్మీర్లోని కతువాలో ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం
Jammu Kashmir: జమ్మూకశ్మీర్ విషాదం నెలకొంది. కథువాలోని ఓ ఇంట్లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు సజీవదహనం అయ్యారు. కతువాలోని శివనగర్ ప్రాంతంలోని రిటైర్డ్ డీఎస్పీ ఇంట్లో మంగళవారం అర్థరాత్రి అనుమానాస్పదస్థితిలో మంటలు చెలరేగడంతో ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. ముగ్గురిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. రక్షించే క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
జిఎంసి కథువా పోలీసు అధికారి సురీందర్ అత్రి ఊపిరాడక ఆరుగురు మరణించినట్లు చెప్పారు. మంటలు చెలరేగిన ఇంట్లో తొమ్మిది మంది నిద్రిస్తున్నారని, వారిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురికి తీవ్రగాయాలైనట్లు తెలిపారు. వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. పొగధాటికి పక్కింటి వ్యక్తి కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లాడని ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్నిప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు.