దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విధంగా రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రంలోని మోదీ ప్రభుత్వం డిసెంబర్ 17న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఆ తరువాత ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సమర్పించే అవకాశం ఉంది. ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని బీజేపీ ఇప్పటికే విప్ కూడా జారీ చేసింది.
అయితే, ఈ బిల్లును ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీలకు ఉనికిలేకుండా పోతోందనే ఈ కూటమిలోని రాజకీయ పక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఈ ప్రతిపాదన ఎలా మొదలైంది?
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1952, 1957, 1962, 1967లలో మొదటి నాలుగు ఎన్నికలు కేంద్రంలో, రాష్ట్రాలలో ఒకేసారి నిర్వహించారు. ఆ తరువాత కాలంలో ఏడు సార్లు పార్లమెంటు గడువు కన్నా ముందే రద్దయిపోవడం, రాష్ట్రాల అసెంబ్లీలలో కూడా అధికార పక్షాలు మెజారిటీ లేక పడిపోవడం వంటి పరిణామాలతో ఏక కాలంలో ఎన్నికలు జరపడం అన్నది సాధ్యం కాకుండా పోయింది.
అయితే, దేశమంతటా పార్లమెంటుకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలనే ప్రతిపాదన మళ్ళీ 1982లో తెర ముందుకు వచ్చింది. అప్పట్లో ఎన్నికల కమిషన్ ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ తరువాత 1999లో లా కమిషన్ కూడా జమిలి ఎన్నికలే మేలని సూచించింది.
అయితే, జమిలి ఎన్నికలు నిర్వహించడం వల్ల నిజంగా దేశానికి, ప్రజలకు మేలు జరుగుతుందా? ఈ విషయంలో బీజేపీ, దాని మిత్ర పక్షాలు చెబుతున్న వాదన కరెక్టేనా? ఈ ఆలోచన సరైనదే అయితే విపక్షాలు మూకుమ్మడిగా దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
వన్ నేషన్ – వన్ ఎలక్షన్ విధానంలో మంచి ఏంటి... చెడు ఏంటన్నది ఇప్పుడు పరిశీలిద్దాం.
వన్ నేషన్ వన్ ఎలక్షన్‌తో లాభాలు..
1. భారతదేశంలో లోక్ సభ ఎన్నికల నిర్వహణకు కేంద్రానికి 4,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతందని అంచనా. ఇక, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఖర్చును కలిపితే ఇది తడిసి మోపెడవుతుంది. అయితే, ఇది అధికారిక ఖర్చు మాత్రమే. ఇక అనధికారికంగా ఎన్నికల్లో ప్రవహించే డబ్బు ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడానికి కూడా వీల్లేని పరిస్థితులు వచ్చేశాయి. జమిలి ఎన్నికల వల్ల ఈ ఖర్చు చాలా వరకు తగ్గుతుందన్నది ఈ విధానాన్ని సమర్థించే వారు అంటున్నారు.
2. జమిలి ఎన్నికల విధానం అమల్లోకి వచ్చి, దేశమంతటా ఎన్నికలు ఒకసారి పూర్తి అయితే అటూ కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పాలన మీద, అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాల మీద ఫోకస్ పెట్టడానికి వీలవుతుంది.
3. ఎక్కడో ఓ చోట ఎప్పుడూ ఎన్నికలు జరుగుతుంటే ఖర్చు పెరుగుతుంది. కోడ్ అమలుతో పాలన కుంటుపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ అసలు పనులు వదిలేసి ఎన్నికల డ్యూటీలు చేయాల్సి వస్తుంది. జమిలితో ఈ గొడవ పోతుందని కూడా చెబుతున్నారు.
4. ఇక, అన్నింటికన్నా ముఖ్య మైన అంశం వివిధ రాష్ట్రాలలో తరచూ ఎన్నికలు జరుగుతుండడం వల్ల రాజకీయ పార్టీలు జనాలను మతాలు, కులాల వారీగా తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాలు అమలు చేస్తుంటాయి. భిన్నత్వంలో ఏకత్వమే ప్రత్యేకతగా చెప్పుకునే భారతదేశంలో ఈ రాజకీయ కుమ్ములాటల వల్ల సమాజానికి నష్టం జరుగుతోందని, అందుకు జమిలి ఎన్నికలు ఒక పరిష్కారమని కూడా చెబుతున్నారు.
జమిలి ఎన్నికలతో నష్టాలు
1. కేంద్ర, రాష్ట్రాల ఎన్నికలు ఒకేసారి జరిగితే భారతదేశ సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుందన్నది జమిలిపై వినిపిస్తున్న ప్రధాన విమర్శ. లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే, స్థానిక సమస్యలు పక్కకు పోయి, జాతీయ అంశాలు ప్రధాన అజెండాగా మారిపోతాయని, ఇది సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
2. దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరపడం అన్నది ఆచరణలో చాలా కష్టం. వంద కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ఎన్నికల నిర్వహణకు సిబ్బంది భారీ సంఖ్యలో కావాల్సి ఉంటుంది. అలాగే, ఈవీఎం మెషీన్లు కూడా భారీ స్థాయిలో సమకూర్చుకోవాలి.
3. కేంద్రంలో లేదా ఏదైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ సభ విశ్వాసాన్ని కోల్పోతే, ప్రభుత్వం మధ్యలోనే కుప్పకూలిపోతే ఏమవుతుందన్నది మరో ప్రశ్న. అలాంటి సందర్భాలలో అవిశ్వాస తీర్మానం తరువాత విశ్వాస తీర్మానం కూడా ప్రవేశ పెట్టాలని అంటున్నారు. ఇది రాజకీయ కొనుగోళ్ళకు ఆస్కారమిస్తుంది. జమిలి రూల్ ప్రకారం ఒకవేళ మధ్యలో ఎన్నికలు జరిగినా కొత్తగా వచ్చే ప్రభుత్వానికి అయిదేళ్ళ పదవీ కాలం ఉండదు. తదుపరి జమిలి ఎన్నికల వరకే అధికారంలో ఉంటుంది. అంటే, ఒక ప్రభుత్వం పడిపోయిన తరువాత మిగిలిన కాలానికి మాత్రమే కొత్త ప్రభుత్వం ఎన్నిక జరుగుతుందన్న మాట. ఆ తరువాత జమిలి షెడ్యూల్ ప్రకారం కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలు ఎన్నికలకు వెళ్ళాలి. ఈ విషయంలోనే రాజ్యాంగానికి సవరణలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది.
4. ప్రాంతీయ పార్టీల ఉన్నికి జమిలి ఎన్నికలు ప్రశ్నార్థకం చేస్తాయనే మరో కీలకమైన ప్రశ్న కూడా బలంగా వినిపిస్తోంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రంలో కూడా అదే పార్టీ అధికారంలో ఉండాలనే చర్చ ముందుకు వస్తుందని, అది వివిధ రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని దెబ్బ తీసే ప్రమాదం ఉందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి.
సర్వేలు ఏం చెబుతున్నాయి?
దేశ మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే 77 శాతం మంది ప్రజలు ఒకే పార్టీ లేదా కూటమిని ఎన్నుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని IDFC నిర్వహించిన సర్వేలో తేల్చి చెప్పింది. అసెంబ్లీ, పార్లమెంట్ కు ఆరు నెలల తేడాతో ఎన్నికలు జరిగితే ఒకే పార్టీని ఎన్నుకునే అవకాశాలు 61 శాతానికి తగ్గిపోతాయని, అదే ఏడాది దాటితే ఈ ప్రభావం మరింత తగ్గుతుందని ఆ రిపోర్టు తెలిపింది.
జమిలి ఎన్నికలు పరోక్షంగా అధ్యక్ష తరహా పాలనకు దారితీస్తాయని రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రాలను తమ ఆధీనంలో పెట్టుకోవడానికి జమిలి ఎన్నికలు పనికొస్తాయని, ఈ విధానం రాజ్యాంగ విరుద్దమని ఆయన అన్నారు.
రాజకీయ, సామాజిక విశ్లేషకులు ప్రొఫెసర్ హరగోపాల్ కూడా జమిలి ఎన్నికలకు ఇది సరైన సమయం కాదనే అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. పదే పదే ఎన్నికల నిర్వహణతో ఖర్చు అవుతోందనే వాదనలో అర్ధం లేదని, ఎన్నికలకు అయ్యే ఖర్చు దేశ జీడీపీలో 2 శాతం కన్నా తక్కువేనని ఆయన అన్నారు.
ముఖ్యంగా, ఈ తరహా ఎన్నికలతో ప్రాంతీయ, ఉప ప్రాంతీయ సమస్యలు చర్చకు రాకుండా పోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.
బిల్లు రూపకల్పనలో ఈ విమర్శలకు ఎలా పరిగణనలోకి తీసుకుంటారు, భారత రాజ్యాంగంలోని కీలక అంశమైన సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలుగకుండా జమిలి బిల్లును ఎలా పైనలైజ్ చేస్తారన్నది వేచి చూడాలి.
--