Formula E Car Race: 'బీఆర్ఎస్ కు రూ. 41 కోట్లు ఎన్నికల విరాళం', కాంగ్రెస్ కు విరాళాలందాయన్న కేటీఆర్
ఫార్మూలా ఈ కారు రేసు కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది.
ఫార్మూలా ఈ కారు రేసు కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ రేసు నిర్వహణకు సంబంధించి తొలుత ప్రమోటర్ గా వ్యవహరించిన గ్రీన్ కో సంస్థ ద్వారా బీఆర్ఎస్ కు రూ. 41 కోట్ల లబ్ది జరిగిందని ప్రభుత్వం ఆరోపణలు చేసింది. కొన్ని మీడియా సంస్థలు ఇందుకు సంబంధించి కథనాలు ప్రసారం చేశాయి. గ్రీన్ కో సంస్థ ద్వారా బీఆర్ఎస్ కు రూ. 41 కోట్లు బాండ్ల ద్వారా విరాళాలు అందాయని ప్రభుత్వం వివరించినట్టు ఆ కథనాలు వెల్లడించాయి. గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థలు 2022 ఏప్రిల్ 8 నుంచి అక్టోబర్ 10 మధ్యలో ఈ బాండ్లను కొనుగోలు చేశారని ప్రభుత్వం ఆరోపణలు చేసింది.
గ్రీన్ కో సంస్థ ఎన్నికల బాండ్లు 2022లో అందాయి: కేటీఆర్
గ్రీన్ కో సంస్థ 2022లో ఎన్నికల బాండ్లు 2022 లో తమ పార్టీకి ఇచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. తెలంగాణ భవన్ లో సోమవారం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. పార్మూలా ఈ కారు రేసు పోటీలు 2023లో జరిగాయని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు కూడా గ్రీన్ కో బాండ్లు ఇచ్చిందని ఆయన అన్నారు. ఈ కారు రేసులతో గ్రీన్ కో సంస్థ నష్టపోయిందన్నారు. పార్లమెంట్ ఆమోదించిన ఎన్నికల బాండ్లు అవినీతి ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు వచ్చిన బాండ్లపై చర్చకు సిద్దమని కేటీఆర్ సవాల్ చేశారు. ఎలక్టోరల్ బాండ్లకు ఫార్మూలా ఈ కారు రేసుకు సంబంధం లేదని ఆయన ఆయన అన్నారు.
ఫార్మూలా ఈ కారు రేసులో 9వ సీజన్ కు సంబంధించి గ్రీన్ కో సంస్థ ప్రమోటర్ గా వ్యవహరించింది. అయితే ఈ సీజన్ లో లాభాలు రాలేదని సీజన్ 10 పోటీల నిర్వహణకు గ్రీన్ కో సంస్థ ముందుకు రాలేదు. ఫార్మూలా ఈ రేస్ నిర్వహణకు సంబంధించిన ఆపరేషన్స్ ను గ్రీన్ కో సంస్థకు అప్పగించారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. క్విడ్ కో ప్రో లో భాగంగా వీటిని అప్పగించారని ప్రభుత్వం విమర్శలు చేస్తోంది. అయితే ఆరోపణలను బీఆర్ఎస్ తోసిపుచ్చింది. కాంగ్రెస్, బీజేపీలకు గ్రీన్ కో సంస్థ నుంచి ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చిన వివరాలను బీఆర్ఎస్ మీడియాకు విడుదల చేయాలని భావిస్తోంది.