Congress-BJP: బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన యూత్ కాంగ్రెస్: పరస్పరం రాళ్ల దాడి

బీజేపీ కార్యాలయం వద్ద కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య మంగళవారం ఘర్షణ జరిగింది.

Update: 2025-01-07 08:04 GMT

Congress-BJP: బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన యూత్ కాంగ్రెస్: పరస్పరం రాళ్ల దాడి

బీజేపీ కార్యాలయం వద్ద కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య మంగళవారం ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ నాయకులు రమేశ్ బిదూరి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ కార్యాలయాల ముట్టడికి యూత్ కాంగ్రెస్ పిలుపు ఇచ్చింది. దీంతో హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయాన్ని కాంగ్రెస్ శ్రేణులు ముట్టడించాయి.

కాంగ్రెస్ కార్యకర్తలను బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకానొక సమయంలో ఇరువర్గాలు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. రాళ్ల దాడిలో బీజేపీకి చెందిన ఓ కార్యకర్తకు గాయమైంది.బీజేపీ కార్యాలయంపై కోడిగుడ్లు, టమాటలతో దాడి చేశారు.

బీజేపీ కార్యాలయం వద్ద రమేష్ బిధూరీ దిష్టిబొమ్మను కాంగ్రెస్ శ్రేణులు దగ్దం చేశారు. బీజేపీ నుంచి రమేశ్ ను సస్పెండ్ చేయాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేశారు.బీజేపీ కార్యాలయం ముందు శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన తమపై బీజేపీ శ్రేణులు దాడులకు దిగాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది.ఇరు వర్గాలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ దాడిని బీజేపీ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. 

సీసీ పుటేజీ ఆధారంగా చర్యలు తీసుకుంటాం: ఏసీపీ విక్రమాన్ సింగ్

బీజేపీ కార్యాలయంపై దాడి ఘటనపై సీసీపుటేజీ ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఏసీపీ విక్రమాన్ సింగ్ చెప్పారు. బీజేపీ కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలీసులకు బీజేపీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు  చేసి దర్యాప్తును ప్రారంభించారు.

రమేశ్ బిధూరీ ప్రియాంకపై ఏమన్నారంటే?

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రమేశ్ బిధూరీ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లా చేస్తానని చెప్పారు. జనవరి 5న దిల్లీలో జరిగిన ఓ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. గతంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ రోడ్లను హేమమాలిని చెంపల మాదిరిగా చేస్తానని ఇచ్చిన హామీని ఆయన అమలు చేయలేదని బిధూరీ విమర్శించారు.

Tags:    

Similar News