Formula E Race Case: ఈఎఫ్ఓకు నిధుల బదిలీపై బీఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నిస్తున్న ఈడీ
Formula E Race Case: ఫార్మూలా ఈ కారు రేసు కేసులో హెచ్ఎండీఏ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యారు.
Formula E Race Case: ఫార్మూలా ఈ కారు రేసు కేసులో హెచ్ఎండీఏ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. జనవరి 2న ఆయనను విచారణకు రావాలని ఈడీ అధికారులు తొలుత నోటీసులు పంపారు. అయితే విచారణకు హాజరయ్యేందుకు తనకు సమయం కావాలని బీఎల్ఎన్ రెడ్డి ఈడీని కోరారు. దీంతో ఈడీ అధికారులు ఆయనను జనవరి 8న విచారణకు రావాలని మరో నోటీసు పంపారు. ఈ నోటీసు ఆధారంగా ఇవాళ ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. జనవరి 9న ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్ ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఇవాళ ఆయన ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9న ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరౌతారు.
ఫార్మూలా ఈ కారు రేసు ఒప్పందంలో భాగంగా హెచ్ఎండీఏ నుంచి 2024 అక్టోబర్ 5, అక్టోబర్ 11న రూ.23 కోట్ల చొప్పున రూ. 46 కోట్లను ఎఫ్ఈఓకు చెల్లించారు. ట్యాక్స్ ల రూపంలో మరో రూ. 9 కోట్లను కూడా హెచ్ఎండీఏ చెల్లించింది. అయితే ఇండియన్ కరెన్సీ రూపంలో కాకుండా పౌండ్ల రూపంలో ఈ నిధులను చెల్లించారు. ఈ నిదుల చెల్లింపునకు గాను అప్పట్లో హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ గా ఉన్న బీఎల్ఎన్ రెడ్డి బాధ్యుడు. దీంతో ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇందులో ఫెమా ఉల్లంఘన, మనీలాండరింగ్ జరిగిందనే కోనణంలో డీ అధికారులు విచారిస్తున్నారు. హిమాయత్ నగర్ లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి ఈ నిధులు బదలాయింపు జరిగింది. ఈ నిధుల బదలాయింపు చేయాలని బీఎల్ఎన్ రెడ్డిని ఎవరు ఆదేశించారు. దీనికి సంబంధించి ఉత్తర ప్రత్యుత్తరాలు ఇతర అంశాలను కూడా ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.ఎంత డబ్బును ఎలా చెల్లించాలని కోరారు, ఎవరెవరి ఖాతాల్లోకి ఈ నిధులను చేరవేయాలని కోరారు. ఆ ఖాతాల వివరాలు ఎవరివి, ఈ ఖాతాలు ఎవరివో నిర్ధారణ చేసుకున్నారా... వంటి ప్రశ్నలను ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నిస్తారని సమాచారం
ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను బీఎల్ఎన్ రెడ్డి ఈడీ కార్యాలయానికి తెచ్చారు. ఈ డాక్యుమెంట్లను ఈడీ అధికారులు పరిశీలించారు. ఫార్మూలా ఈ కారు రేసు కేసుకు సంబంధించి పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్ ఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసు ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసి విచారణను ప్రారంభించింది.