Formula E Race Case: తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్
Formula E Race Case: ఫార్మూలా ఈ కారు రేసు కేసులో విచారణకు హాజరయ్యే సమయంలో న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు.
Formula E Race Case:ఫార్మూలా ఈ కారు రేసు కేసులో విచారణకు హాజరయ్యే సమయంలో న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు స్వీకరించింది.
ఫార్మూలా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఈ నెల 9న విచారణకు రావాలని కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6 విచారణకు న్యాయవాదిని అనుమతించని కారణంగా తన ఏసీబీ ఇచ్చిన నోటీసుకు ఆయన సమాధానం ఇచ్చి వెళ్లిపోయారు. అయితే ఈ నెల 9న విచారణకు హాజరయ్యే సమయంలో కూడా అడ్వకేట్ కు ఏసీబీ అనుమతించలేదు. దీంతో ఏసీబీ విచారణకు హాజరయ్యే సమయంలో తన న్యాయవాదిని అనుమతించాలని ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ బుధవారం మధ్యాహ్నం జరగనుంది.
రాజ్యాంగం కల్పించిన హక్కును తాను వినియోగించుకుంటానని కేటీఆర్ మంగళవారం రాత్రి మీడియా సమావేశంలో చెప్పారు. ఏసీబీ నమోదు చేసిన కేసుపై తాను న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించారు. ఫార్మూలా ఈ కారు రేసుకు సంబంధించి అగ్రిమెంట్ లో నిబంధనల ఉల్లంఘన జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ వాదన. అదే సమయంలో ప్రభుత్వ ఖజానాకు కూడా నష్టం జరిగిందని కూడా ప్రభుత్వం వాదిస్తోంది. ఇదే సమయంలో ఎఫ్ ఈ ఓకు నిధుల బదలాయింపులో కూడా ఆర్ బీ ఐ అనుమతి తీసుకోలేదని ప్రభుత్వం చెబుతోంది.
అయితే ఈ వాదనలతో కేటీఆర్ ఏకీభవించడం లేదు. అవినీతి జరగనప్పుడు ఏసీబీలోని సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. రాజకీయ కక్షతోనే తనపై కేసులు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. ఈ కేసును తాను న్యాయపరంగా ఎదుర్కుంటానని కేటీఆర్ తెలిపారు.ఫార్మూలా ఈ కారు రేసులో తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు జనవరి 7న కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో కేటీఆర్ సవాల్ చేశారు.