KTR press meet: రేవంత్ రెడ్డి గురించి ఈ విషయం అందరికీ చెప్పాలన్న కేటీఆర్
Formula E Car race case latest updates: తెలంగాణలో ఆడపడుచులకు ఇస్తామన్న డబ్బులు ఇవ్వడం లేదు కానీ ఇచ్చినట్లుగా వేరే రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం కోసం చెప్పుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. హైడ్రా కూల్చివేతల్లో ఇళ్లు కోల్పోయిన బాధితులు, లగచర్ల దాడి ఘటనలో అక్రమ కేసులు ఎదుర్కొంటున్న బాధితుల ముందు, జైళ్లలో మగ్గుతున్న గిరిజన రైతుల కష్టం ముందు తమది ఏపాటి కష్టమని కేటీఆర్ ప్రశ్నించారు.
రాబోయే 350 రోజుల పాటు రేవంత్ రెడ్డి సర్కారు రైతులను ఎలా మోసం చేస్తుందనే విషయాన్ని ప్రతీ రైతు ఇంటికి వెళ్లి వారికి అర్థమయ్యేలా చెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు పథకం డబ్బులు ఇవ్వబోతుండగా ఎన్నికల సంఘానికి లేఖ రాసి మరీ రేవంత్ రెడ్డి అడ్డంపడ్డారని కేటీఆర్ ఆరోపించారు.
రుణమాఫీ ఏమైంది, రైతు భరోసా ఏమైంది, కౌలు రైతులకు ఇస్తామన్న ఆర్థిక సహాయం ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. ఇవన్నీ ప్రశ్నిస్తున్నామనే తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కానీ రేవంత్ రెడ్డి సర్కారు పెట్టే ఈ అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. తమ తరపున కొట్లాడేందుకు జోర్దర్ లాంటి లీగల్ సెల్ ఉందని, అందుకే తాము ప్రజల కోసం కొట్లాడుతామని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం పెట్టే కేసుల గురించి తాము చూసుకుంటామని, ఆ విషయంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భయపడాల్సిన పని లేదన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు చేయాల్సిందల్లా రేవంత్ రెడ్డి సర్కారు ఇచ్చిన హామీలను (Telangana govt promises) నిలబెట్టుకోకుండా రైతులను, జనాన్ని ఎలా మోసం చేస్తుందో ఇంటింటికి వెళ్లి చెప్పాలని గుర్తుచేశారు.