Formula E Car Race Case: కేటీఆర్ కు ఈడీ మరోసారి నోటీసులు

Update: 2025-01-07 09:10 GMT

ఫార్మూలా ఈ కారు రేసు కేసు: కేటీఆర్ కు ఈడీ మరోసారి నోటీసులు

ఫార్మూలా ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. జనవరి 16న విచారణకు రావాలని ఈడీ ఆ నోటీసులో కోరింది. ఈ కేసులో జనవరి 7న విచారణకు రావాలని ఈడీ తొలుత కేటీఆర్ కు నోటీసు జారీ చేసింది. అయితే హైకోర్టు తీర్పు ఉన్నందున సమయం కోరారు. ఫార్మూలా ఈ కారు రేసులో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.దీంతో కేటీఆర్ కు ఈడీ జనవరి 7న నోటీసులు జారీ చేసింది.

పార్మూలా ఈ కారు రేసులో నిబంధనల ఉల్లంఘన జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించింది.ఈ మేరకు 2024 అక్టోబర్ 18న మున్సిపల్ శాఖ కార్యదర్శి దానకిశోర్ ఏసీబీకి లేఖ రాశారు. కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా అనుమతి ఇచ్చారు.దీంతో 2024 డిసెంబర్ 19న ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసు ఆధారంగా ఈడీ కూడా ఈసీఐఆర్ ను ఫైల్ చేసింది. ఈ కేసులో ఈడీ విచారణకు రావాలని ఇప్పటికే కేటీఆర్ సహా బీఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ లకు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8న బీఎల్ఎన్ రెడ్డిని, ఈ నెల 9న అరవింద్ కుమార్ ను విచారణకు రావాలని ఈడీ కోరింది.

ఫార్మూలా ఈ కారు రేసులో కేటీఆర్ పై కేసు రాజకీయ కక్షతో నమోదు చేసిందేనని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.  ఈ కేసుపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నామని ఆ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. హైకోర్టు తీర్పు తర్వాత కేటీఆర్ తో హరీష్ రావు సహా ఆ పార్టీ కీలక నాయకులు సమావేశమయ్యారు.ఈ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

ఫార్మూలా ఈ కారు రేసు కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత ఏసీబీ దూకుడు పెంచింది. గ్రీన్ కో దాని అనుబంధ సంస్థల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్టణంలో కూడా ఏసీబీ సోదాలు చేశారు.

Similar News