HMPV Virus ఎఫెక్ట్.. మాస్క్‌లకు, శానిటైజర్లకు పెరిగిన డిమాండ్..
HMPV Virus: హెచ్‌ఎంపీవీ వైరస్ భారత్‌లో వ్యాపిస్తోంది. ఇప్పటికే దేశంలో ఏడు కేసులు నమోదు కావడంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమయింది.
HMPV Virus: హెచ్‌ఎంపీవీ వైరస్ భారత్‌లో వ్యాపిస్తోంది. ఇప్పటికే దేశంలో ఏడు కేసులు నమోదు కావడంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమయింది. పొరుగు రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో కేసులు వెలుగు చూస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. అయితే హెచ్‌ఎంపీవీ వైరస్ విషయంలో భయాందోళన చెందాల్సిన అవసరంలేదని, సాధారణ వైరస్ మాత్రమేనని వైద్యులు చెబుతున్నప్పటికీ ప్రజలు మాత్రం ముందస్తు చర్యలు చేపడుతున్నారు. కరోనా సమయంలో పడిన ఇబ్బందుల కారణంగా ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తున్నారు.
హెచ్‌ఎంపీవీ వైరస్ పట్ల అప్రమత్తమైన తెలంగాణ సర్కార్ మార్గదర్శకాలను విడుదల చేసింది. బయట నుంచి వచ్చిన తర్వాత శుభ్రంగా చేతులు శుభ్రపర్చుకోవాలని సూచించింది. షేక్ హ్యాండ్స్ ఇవ్వొద్దని, భౌతిక దూరం పాటించాలని కోరింది. జలుబు, దగ్గు, జ్వరం ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కోరింది. అయితే ఇది మామూలు వైరస్ మాత్రమేనని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
గతంలోనే ఈ వైరస్‌ను కనుగొన్నారని, ఫ్లూకు సంబంధించిన మందులను వాడితే సరిపోతుందని చెబుతోంది. కానీ ప్రజల్లో మాత్రం కొంత ఆందోళన కలిగిస్తోంది. దీనికి కారణం కరోనా. మొదట కరోనా వైరస్ వ్యాపించినప్పుడు కూడా ఆరోగ్యశాఖ అధికారులు ఇలానే చెప్పారని కరోనా నాటి కాలాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అందుకే ఎవరికి వారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే మరోవైపు HMPV వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మాస్క్‌లు, శానిటైజర్లకు డిమాండ్ పెరిగింది. నిన్న మొన్నటి వరకు మాస్క్‌లు అడిగిన వారు లేరని.. కానీ రెండు, మూడు రోజుల నుంచి మాస్క్‌లు, శానిటైజర్ల కొనుగోళ్లు పెరిగాయని విక్రయదారులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నట్టు మందుల షాపుల యజమానులు తెలిపారు.