Formula E Race Case: గ్రీన్ కో కార్యాలయంలో ఏసీబీ సోదాలు
ACB Raids: గ్రీన్ కో కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ACB Raids: గ్రీన్ కో కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫార్మూలా ఈ కారు రేసులో గ్రీన్ కో అనుబంధ సంస్థ ఎస్ నెక్ట్స్ జెన్ లోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. గ్రీన్ కో దాని అనుబంధ సంస్థల నుంచి బీఆర్ఎస్ కు రూ. 41 కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో అందాయని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది.
2022 ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య ఎన్నికల బాండ్ల రూపంలో రూ. 41 కోట్లు గులాబీ పార్టీకి అందాయని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. అయితే ఫార్మూలా ఈ కారు రేసుకు ముందే గ్రీన్ కో దాని అనుబంధ సంస్థలు తమ పార్టీకి విరాళాలు ఇచ్చాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. దీనికి ఫార్మూలా ఈ కారు రేసుకు తమ పార్టీకి అందిన విరాళాలతో సంబంధం లేదని కూడా ఆయన తేల్చి చెప్పారు. గ్రీన్ కో దాని అనుంబంధ సంస్థల నుంచి బీజేపీ,కాంగ్రెస్ కూడా ఎన్నికల బాండ్ల రూపంలో విరాళాలు అందాయని కేటీఆర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లోనూ ఏసీబీ సోదాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్టణంలోని గ్రీన్ కో సంస్థ కార్యాలయాల్లో తెలంగాణకు చెందిన ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. తెలంగాణ నుంచి వచ్చిన ఏసీబీ అధికారుల బృందం మచిలీపట్టణంలోని ఈ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.
ఫార్మూలా ఈ కారు రేసు సీజన్ 9 నిర్వహణకు ప్రమోటర్ గా గ్రీన్ కో సంస్థకు అనుబంధంగా ఉన్న ఏస్ నెక్ట్స్ జెన్ వ్యవహరించింది. అయితే సీజన్ 9 నిర్వహణలో నష్టాలు వచ్చాయని ఆ సంస్థ అప్పట్లో తెలిపి సీజన్ 10ప్రమోటర్ గా వ్యవహరించేందుకు ముందుకు రాలేదు.