కరోనా కట్టడి యోధులపై వైరస్ పంజా

కరోనా కాలంలో వైద్యసిబ్బంది, పోలీసు యంత్రాంగం అందిస్తున్న సేవలు అమోఘం.

Update: 2020-06-23 12:41 GMT
Representational Image

కరోనా కాలంలో వైద్యసిబ్బంది, పోలీసు యంత్రాంగం అందిస్తున్న సేవలు అమోఘం. వైద్యులు ప్రాణాలకు తెగించి కరోనా బాధితులను కాపాడుతున్నారు. కరోనా నియంత్రణ కోసం పోలీసులు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారు. కానీ ఇప్పుడు కరోనా వైరస్ ఆ యోధులపైనే పంజా విసురుతోంది. కాపాడే రక్షకులనే భక్షిస్తోంది ఆ మహమ్మారి.

కరోనా బారి నుంచి ప్రజల్ని కాపడుతున్న వైద్యసిబ్బంది, పోలీసులను కరోనా భూతం వెంటాడుతోంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 287 మంది పోలీసు సిబ్బంది, 90 మంది వైద్య సిబ్బంది కరోనాతో బాధపడుతున్నారు. వీరిలో ఐపీఎస్‌ అధికారులు, సూపర్‌ స్పెషలిస్టు వైద్యనిపుణులు ఉండడం బాధాకరం.

ఇంటింటికీ తిరుగుతున్న ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎంలకు వైరస్‌ వ్యాప్తి చెందడానికి అవకాశాలెక్కువ. వీరితోపాటు బాధితులను ఆసుపత్రులకు తరలించే వైద్య సిబ్బందికి, ఇందుకు సహకరించే పోలీసులకు, చికిత్సనందించే వైద్యులు, నర్సులు, సహాయక సిబ్బందికి కూడా కొవిడ్‌ సోకే ప్రమాదం పొంచి ఉంది.

ఉస్మానియా, నిమ్స్‌ ఆసుపత్రులకు ఓపీ పెషంట్ల తాకిడి పెరిగింది. దీంతో ఇక్కడ సేవలందిచే వైద్యులకు, సిబ్బందికి కొవిడ్‌ సోకింది. ఓపీల్లో ప్రధాన పాత్ర పోషించే పీజీ వైద్య విద్యార్థులు అధికంగా పాజిటివ్‌లుగా తేలారు. ఇందులో కార్డియాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు సహా స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ వైద్యులు కూడా ఉన్నారు. ఇప్పటివరకూ 75 మంది వైద్యులు కరోనాతో బాధపడుతున్నారు.

హైదరాబాద్ పోలీసు సిబ్బంది అధికంగా కొవిడ్‌ బారినపడుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 287 మంది పోలీసులకు కరోనా సోకగా, వారిలో 252 మంది హైదరాబాద్‌ లో విధులు నిర్వర్తిస్తున్నవారు.. తాజాగా ఓ ప్రైవేట్ వైద్యుడు, ఏఎస్సై మహమ్మారితో పోరాడి తుదిశ్వాసవిడిచారు. 

Tags:    

Similar News