Formula E Race Case: కేటీఆర్ కు మరోసారి నోటీసులు ఇవ్వనున్న ఏసీబీ
Formula E Race Case: ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ కు మరోసారి ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.
Formula E Race Case: ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ కు మరోసారి ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. జనవరి 6న న్యాయవాదితో కలిసి విచారణకు హాజరయ్యేందుకు అధికారులు అనుమతించినందున కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరుకాకుండానే ఆయన వెనక్కు తిరిగారు. ఏసీబీ విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశించినందున మరోసారి ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది అయితే కేటీఆర్ తో కలిసి విచారణకు హాజరయ్యేందుకు న్యాయవాదులను అనుమతించకపోవచ్చని ఏసీబీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఫార్మాలా ఈ కారు రేసు కేసులో విచారణకు రావాలని జనవరి 3న ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేసి జనవరి 6న విచారణకు రావాలని ఆదేశించారు. సోమవారం న్యాయవాదితో కలిసి విచారణకు అంగీకరించినందున కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరుకాలేదు. ఏసీబీకి లేఖ ఇచ్చి ఆయన తెలంగాణ భవన్ కు వెళ్లారు.
నిబంధనలకు విరుద్దంగా ఈఎఫ్ఓకు నిధుల బదలాయింపు, అగ్రిమెంట్ కు ముందే నిదుల చెల్లింపుతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఈ కేసులో ఏ 1గా కేటీఆర్, ఏ 2 గా ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3 గా హెచ్ఎండీఏ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి పేర్లను చేర్చింది ఏసీబీ. మరో వైపు ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఈ నెల 7న ఇదే కేసులో ఈడీ విచారణకు కేటీఆర్ హాజరుకావాల్సి ఉంది. ఈ నెల 8,9 తేదీల్లో బీఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది.
2022 అక్టోబర్ లో ఫార్మూలా ఈ కారు రేసుకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈఎఫ్ఓతో ఒప్పందం చేసుకుంది. సీజ్ 9, 10,11,12 రేసులను నిర్వహించాలనేది ఈ ఒప్పందం ఉద్దేశం. అయితే 2023 ఫిబ్రవరిలో సీజన్ 9 రేసులు జరిగాయి. సీజన్ 10 కి సంబంధించి ప్రమోటర్ గా వ్యవహరించిన సంస్థ ముందుకు రావడంతో అంతకుముందున్న త్రైపాక్షిక ఒప్పందం ద్వైపాక్షిక ఒప్పందంగా మారింది. ఇక్కడే నిబంధనల ఉల్లంఘన జరిగిందనేది ప్రభుత్వ వాదన.