ఉత్తరాఖండ్ వరదలకు కారణం అదికాదు
ఉత్తరాఖండ్ లో సంభవించిన వరదలకు ఛార్ ధామ్ రోడ్డు విస్తరణకు సంబంధం లేదు
చార్‌ధామ్ రోడ్డు విస్తరణకు, ఇటీవల ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో సంభవించిన ఆకస్మిక వరదలకు సంబంధం లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఉత్తరాఖండ్ వరదల్లో అనేక మంది గల్లంతయ్యారు. కొందరు అక్కడ ఉన్న సొరంగాల్లో చిక్కుకుపోగా సహాయక చర్యలు జరుగుతున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. నాలుగు పుణ్యక్షేత్రాలైన గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లను కలుపుతూ 900 కిలోమీటర్ల చార్‌ధామ్ హైవే ప్రాజెక్టు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ రోడ్డు విస్తరణ కారణంగానే ఆకస్మిక వరదలు సంభవించాయని ఆ కమిటీ పేర్కొంటూ కేంద్రానికి లేఖ పంపింది.
ఈ అంశంపై కేంద్ర రక్షణ శాఖ తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ స్పందిస్తూ ఉత్తరాఖండ్‌లో రోడ్ల విస్తరణకు, ఇటీవల సంభవించిన వరదలకు ఏ విధమైన సంబంధం లేదన్నారు. దీనిపై స్పందించేందుకు కొంత సమయం కావాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. జస్టిస్ రోహిన్‌టన్, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ బీఆర్ గవాయ్‌లు సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఈ మేరకు కేంద్రానికి రెండు వారాల గడువిచ్చింది.
సుప్రీంకోర్టు నియమించిన కమిటీ అధ్యక్షుడైన రవి చోప్రా మాట్లాడుతూ కేంద్ర నిర్మిస్తున్న ఈ రహదారులపై అనేక ప్రమాదకరమైన మలుపులు, కొండ ప్రాంతాలు ఉన్నాయన్నారు. అంతే కాకుండా ఆ ప్రాంతంలో ఇటీవల వరదలకు రిషిగంగ నదిపై ఉన్న ఓ వంతెన, ఇండియా-చైనా సరిహద్దులో ఉన్న ఒక రహదారి పూర్తిగా కొట్టుకుపోయాయన్నారు. కమిటీ ఇచ్చిన నివేదికకు ఇవి బలాన్ని చేకూరుస్తున్నాయని, ఈ రోడ్లను నిర్మించడం హిమాలయాలకు కోలుకోలేని దెబ్బ అని వారు ఆ నివేదికలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 13న కమిటీ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించారు.
గతంలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే రోడ్ల వెడల్పును సగానికి పైగా తగ్గించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ సరిహద్దుల్లో ఉండే పరిస్థితుల దృష్ట్యా 10 మీటర్ల వెడల్పు రోడ్లకు అనుమతినిచ్చింది.