చిరుతకే చుక్కలు చూపించాడుగా.. తోకను పట్టుకుని..
చిరుత పేరు వింటేనే ఒంట్లో వణుకుపుడుతుంది. ఇక దాని వేట చూస్తే గుండె ఆగిపోయేంత పనవుతుంది.
చిరుత పేరు వింటేనే ఒంట్లో వణుకుపుడుతుంది. ఇక దాని వేట చూస్తే గుండె ఆగిపోయేంత పనవుతుంది. ఎలాంటి జంతువునైనా ఎంతో చాకచక్యంగా వేటాడుతుంటాయి. ఒక్కసారి దానికి చిక్కితే ఏ జంతువు అయినా తప్పించుకోవడం కష్టం. అలాంటి చిరుత కనిపించిందంటే అక్కడి నుంచి వెంటనే పరుగు తీస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం చిరుతను చూసి పరిగెత్తకుండా దాని తోకను పట్టుకుని చుక్కలు చూపించారు. ఈ ఘటన కర్ణాటకలోని రంగపురలో జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
కర్ణాటక రాజధాని బెంగళూరుకు సమీపంలోని తుమకూరు జిల్లా తిప్టూరు తాలూకాలోని రంగపుర గ్రామంలో.. ఐదు రోజులుగా చిరుత పులి గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. దీంతో గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తుల సమాచారంతో అక్కడికి వచ్చిన అధికారులు చిరుతపులిని పట్టుకునేందుకు బోనును ఏర్పాటు చేశారు.
కానీ బోను పెట్టి బంధించేందుకు ప్రయత్నించగా చిరుత తప్పించుకోవాలని చూసింది. ఆ సమయంలో గ్రామానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తి చిరుత పులి తోకను పట్టుకుని అది పారిపోకుండా నిలువరించాడు. వెంటనే అధికారులు వల సాయంతో దాన్ని పట్టి బంధించారు. ఆ తర్వాత దాన్ని బోనులో వేసి అక్కడ నుంచి తరలించారు. తన సాహసోపేతమైన చర్యతో చిరుతను పట్టుకోవడానికి సహకరించిన అతన్ని గ్రామస్తులు, అధికారులు అభినందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు యువకుడి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. మరికొందరు అతని ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.