Top 6 News @ 6PM: ఫార్మూలా ఈ రేసులో కేటీఆర్ కు షాక్, తీర్పులో కీలక అంశాలు... మరో 5 ముఖ్యాంశాలు

ఫార్మూలా ఈ కారు రేసు కేసులో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు జనవరి 7న కొట్టివేసింది

Update: 2025-01-07 13:00 GMT

ఫార్మూలా ఈ రేసులో కేటీఆర్ కు షాక్, తీర్పులో కీలక అంశాలు: మరో 5 ముఖ్యాంశాలు


1.ఫార్మూలా ఈ రేసు: కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేత

ఫార్మూలా ఈ కారు రేసు కేసులో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు జనవరి 7న కొట్టివేసింది. ఈ పిటిషన్ పై 2024 జనవరి 31న తీర్పును రిజర్వ్ చేసింది కోర్టు. ఇవాళ తీర్పును వెల్లడించింది. ఏసీబీ విచారణలో జోక్యం చేసుకోలేమని కోర్టు తెలిపింది. ఇందులో అంతిమ లబ్దిదారులు ఎవరో తేలాలని కోర్టు అభిప్రాయపడింది. ఎఫ్ఐఆర్ క్వాష్ కోసం అన్ని సందర్భాల్లో ఉపయోగించలేమని కోర్టు తెలిపింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని కేటీఆర్ భావిస్తున్నారు. అయితే సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇదిలా ఉంటే క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో ఈ నెల 16 విచారణకు రావాలని ఈడీ కేటీఆర్ కు నోటీసులు పంపింది.

2.దిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను సీఈసీ రాజీవ్ కుమార్ మంగళవారం విడుదల చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 8న కౌంటింగ్ నిర్వహిస్తారు.జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు.

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

ఎన్నికల నోటిఫికేషన్:జనవరి 10

నామినేషన్ల దాఖలుకు చివరి తేది:జనవరి 17

నామినేషన్ల స్కృూట్నీ: జనవరి 18

నామినేషన్ల ఉపసంహరణ: జనవరి 20

దిల్లీలో మొత్తం ఓటర్లు: 1.55 కోట్లు

పురుష ఓటర్లు: 83.49 లక్షలు

మహిళా ఓటర్లు:71.74 లక్షలు

కొత్త ఓటర్లు:2.08 లక్షలు

20-29 ఏళ్ల మధ్య ఓటర్లు:25.89 లక్షలు

దిల్లీలో పోలింగ్ స్టేషన్లు:13,033

ఎస్ సీ అసెంబ్లీ సెగ్మెంట్లు:12

3.టిబెట్ లో భూకంపం:100 మంది మృతి

టిబెట్ లో మంగళవారం భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.8 గా నమోదైంది. ఈ భూకంపంతో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.నేపాల్ భూటాన్ సరిహద్దులో ప్రఖ్యాత ఎవరెస్ట్ శిఖరానికి కేవలం 80 కి.మీ. దూరంలో భూ ఉపరితలం నుంచి 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉంది.

4.బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల వద్ద ఉద్రిక్తత

కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ నాయకులు రమేశ్ బిధూరీ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ హైదరాబాద్ బీజేపీ కార్యాలయాన్ని కాంగ్రెస్ మంగళవారం ముట్టడించింది. ఈ సమయంలో బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఇరువర్గాల మధ్య దాడులు జరిగాయి. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. కాంగ్రెస్ దాడిలో బీజేపీ కార్యకర్త ఒకరు గాయపడ్డారు. ఆ తర్వాత కాంగ్రెస్ కార్యాలయం ముట్టడికి బీజేపీ శ్రేణులు ప్రయత్నించాయి. కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఫ్లెక్సీని చించేశారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్దం చేసే ప్రయత్నం చేశారు. బీజేపీ కార్యాలయంపై దాడి ఘటనపై యూత్ కాంగ్రెస్ పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. దాడులు చేయడం సరైంది కాదని ఆయన అన్నారు.

5. సంక్రాంతికి హైదరాబాద్ ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

సంక్రాంతి పండుగ రద్దీ దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ నుంచి 2,153 ప్రత్యేక బస్సులను నడుపుతామని ఏపీఎస్ఆర్‌టీసీ ప్రకటించింది. జనవి 8 నుంచి 13 వరకు ప్రత్యేక బస్సులు నడుపుతారు. బెంగుళూరు నుంచి 375 విజయవాడ నుంచి 300 ప్రత్యేక బస్సులు నడుపుతారు. ఈ నెల 16 నుంచి 20 వరకు 3200 ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆర్టీసీ ప్రకటించింది. ఒకేసారి తిరుగు ప్రయాణంతో సహా టికెట్ కొనుగోలు చేస్తే 10 శాతం రాయితీ ఇస్తామని ఆర్టీసీ ప్రకటించింది. ప్రత్యేక బస్సుల్లో అడ్వాన్స్ రిజర్వేషన్ కూడా ఉందని ఆర్టీసీ ఎండీ తెలిపారు.

6. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా

కెనడా ప్రధాని పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామా చేశారు. లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి కూడా వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. కెనడా ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన అనిత ఆనంద్, జార్జ్ చాహల్ పేర్లు కూడా విన్పిస్తున్నాయి. క్రిస్టినా ఫ్రీలాండ్, మార్క్ కార్నీ, డొమినిక్ లీ బ్లాంక్, మెలనీ జోలీ, ఫ్రాంకోయిస్ ఫిలిప్పీ తదితరులు కూడా ప్రధాని రేసులో ఉన్నారు.

Tags:    

Similar News