HMPV Cases in India: నిన్న బెంగుళూరు,చెన్నై.. నేడు నాగ్‌పూర్.. రోజు రోజుకు పెరుగుతున్న HMPV వైరస్ కేసులు
HMPV Virus Cases in India: ఇటీవల చైనాలో కలవర పెడుతున్న హ్యూమన్ మెటాన్యుమో వైరస్ భారత్‌లోనూ విస్తరిస్తోంది.
HMPV Virus Cases in India: ఇటీవల చైనాలో కలవర పెడుతున్న హ్యూమన్ మెటాన్యుమో వైరస్ భారత్‌లోనూ విస్తరిస్తోంది. ఇప్పటికే బెంగుళూరులో రెండు, అహ్మదాబాద్‌లో ఒకటి, చెన్నైలో మరో రెండు కేసులు నమోదు కాగా.. తాజాగా మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో మరో రెండు కేసులు నమోదయ్యాయి.
జనవరి 3వ తేదీన చిన్నారులకు జ్వరం, దగ్గు రావడంతో నగరంలోని రాందాస్ పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఇద్దరికీ హెచ్‌ఎంపీవీ సోకినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ ఇద్దరు పిల్లలకు ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. దీంతో భారత్‌లో ఇప్పటివరకు ఏడు కేసులు నమోదయినట్లు అధికారులు తెలిపారు. ఏడు పాజిటివ్ కేసుల్లో బాధితులంతా చిన్నారులే కావడం గమనార్హం.
పలు రాష్ట్రాల్లో కేసులు నమోదవ్వడంతో ఆయా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. జనం ఎక్కువ ఉన్న చోట్ల మాస్కులు ధరించాలని ప్రజలకు సూచిస్తున్నాయి. దగ్గు, జ్వరం వంటి ఏదైన తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న వారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
మరోవైపు ఈ వైరస్ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు.మరోవైపు HMPV కొత్త వైరస్ కాదని ఆరోగ్య రంగ నిపుణులు స్పష్టం చేశారు. దేశంలోని ఆరోగ్య వ్యవస్థలు, నిఘా నెట్ వర్క్‌లు అప్రమత్తంగా ఉన్నాయని పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఆరోగ్యపరమైన సవాళ్లపై తక్షణం స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అందువల్ల భయపడాల్సి అవసరం లేదని నడ్డా తెలిపారు.
చైనాలో హ్యమన్ మెటాన్యుమో వైరస్ సహా పలు శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయన్న వార్తలతో భారత్ ఇప్పటికే అప్రమత్తమైంది. ఇటీవల డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) అధ్యక్షతన జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సమావేశం నిర్వహించింది. శీతాకాలంలో చోటుచేసుకున్న మార్పులు కారణంగానే చైనాలో ఇన్‌ప్లూయెంజా, ఆర్ఎస్‌వీ, హెచ్‌ఎంపీవీ తరహా వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నాయని జేఎంజీ తేల్చింది. భారత్‌లో అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.