Interesting Crime News: సొంత అన్నయ్యనే మోసం చేయాలనుకున్న తమ్ముడి అసలు రూపం బయటపడింది. తనకు తానే కిడ్నాప్ చేసుకుని, మరొకరు కిడ్నాప్ చేసినట్లుగా డ్రామా ఆడి సోదరుడి నుండి రూ. 50 వేలు వసూలు చేయాలని చూసిన తమ్ముడి మోసం బయటపడింది. కిడ్నాపర్స్ పేరుతో బెదిరిస్తూ పంపించిన రాన్సమ్ నోట్ లో ఒక స్పెల్లింగ్ మిస్టెక్ ఉండటమే నిందితుడిని పట్టించ్చింది. అదేంటో తెలియాలంటే ఈ ఫేక్ కిడ్నాప్ స్టోరీ వివరాలు తెలుసుకోవాల్సిందే.
ఉత్తర్ ప్రదేశ్ లోని హర్దోయ్ జిల్లా బాందారహ గ్రామానికి చెందిన సంజయ్ కుమార్ అనే కాంట్రాక్టర్ కు జనవరి 5న ఒక మెసేజ్ వచ్చింది. మీ తమ్ముడిని కిడ్నాప్ చేశామని, రూ. 50 వేలు ఇవ్వకపోతే ఆయన్ని చంపేస్తామని కిడ్నాపర్స్ రాన్సమ్ నోట్ పంపించారు. చంపేస్తాం అని ఇంగ్లీష్ లో రాసేటప్పుడు "Death" అనే స్పెల్లింగ్ కు బదులుగా "Deth" అని తప్పుగా రాశారు. అంతేకాకుండా 13 సెకన్ల నిడివిగల వీడియో కూడా పంపించారు. అందులో సందీప్ కుమార్ కాళ్లు, చేతులు కట్టేసి ఉండటం చూపించారు.
ఆ రాన్సమ్ నోట్ తీసుకుని సంజయ్ కుమార్ పోలీసుల వద్దకు వెళ్లారు. అందులో స్పెల్లింగ్ మిస్టేక్ చూడటంతోనే కిడ్నాపర్లు పెద్దగా చదువుకోలేదు అనే విషయం వారికి అర్థమైంది. అంతేకాకుండా కిడ్నాపర్స్ అడిగిన ఎమౌంట్ కూడా పెద్ద మొత్తం కాకపోవడంతో వారికి అనుమానం వచ్చింది. దాంతో సంజయ్ కుమార్ ను కిడ్నాప్ కు గురైనట్లుగా భావిస్తున్న సందీప్ కుమార్ గురించి ఆరాతీశారు. ఆయన కూడా పెద్దగా చదువుకోలేదని తెలిసింది. వెంటనే సందీప్ కుమార్ ఫోన్ లొకేషన్ ఆధారంగా ఆయన రూపపూర్ లో ఉన్నట్లు తెలిసింది. అక్కడికి వెళ్లి సందీప్ కుమార్ ను గుర్తించి పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు.
పోలీసు స్టేషన్‌లో సందీప్‌ను ప్రశ్నించారు. ఆ రాన్సమ్ నోట్‌లో ఉన్న విషయాన్ని చెప్పి అది మరోసారి రాసివ్వమన్నారు. ఈసారి సందీప్ కూడా "Deth" అనే రాసిచ్చారు. దాంతో వారికి ఆయనే ఈ ఫేక్ డ్రామా ఆడినట్లు అర్థమైంది. కిడ్నాపర్స్ పేరుతో బెదిరిస్తూ రాన్సమ్ నోట్ పంపించింది కూడా సందీప్ కుమారే అని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఇదే విషయమై పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో ఆయన కూడా నిజం ఒప్పుకున్నారు.
డిసెంబర్ 30న తన బైక్ ఢీకొని ఒక వ్యక్తికి కాలు విరిగిందని, ఆ బాధితుడు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ఒత్తిడి తెస్తుండటంతో ఏం చేయాలో అర్థంకాక ఈ డ్రామా ఆడానని పోలీసుల ఎదుట నిజం అంగీకరించారు. అంతేకాదు... CID అనే హిందీ సీరియల్‌లో ఫేక్ కిడ్నాప్ స్టోరీని చూసి ఇన్‌స్పైర్ అవడం ద్వారా ఈ ఫేక్ కిడ్నాప్ (Fake Kidnap inspired from CID serial) ప్లాన్ చేసినట్లు తెలిపారు.