Top 6 News @ 6PM: ఫార్మూలా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ కు స్వల్ప ఊరట, మరో 5 ముఖ్యాంశాలు
కేటీఆర్ కనిపించే దూరంలో లాయర్ ఉండేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది.
1. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా వీసా పొడిగింపు?
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పాస్ పోర్టును రద్దు చేస్తున్నట్టు ఆ దేశం ప్రకటించింది. అయితే ఈ మేరకు ఆ దేశం ఇండియాకు సమాచంరం పంపింది. దీంతో ఆమె వీసా గడువును పొడిగించిందని జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేశాయి.స్థానిక ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ద్వారా వచ్చిన అభ్యర్ధన మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. 2024లో హసీనా స్వదేశాన్ని వీడి భారత్ కు వచ్చారు. బంగ్లాలో జరిగిన హింసకు ఆమెతో పాటు ఆ పార్టీకి చెందిన పలువురిపై కేసులు నమోదయ్యాయి.
2. మందుబాబులకు షాక్ తెలంగాణలో నిలిచిపోనున్న బీర్లు
ఐదేళ్లుగా ధరలు పెంచకపోవడంతో నష్టాలు వస్తున్నాయని యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ యూబీఎల్ సంస్థ ఐదు రకాల బీర్ల సరఫరాను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ఎక్సైజ్ శాఖకు లేఖను అందించింది. ధరల పెంపుపై ప్రభుత్వం నుంచి స్పందించలేదని ఆ సంస్థ చెబుతోంది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపింది.
3. ఏసీబీ విచారణకు కేటీఆర్ కు లాయర్ అనుమతి: తెలంగాణ హైకోర్టు
కేటీఆర్ కనిపించే దూరంలో లాయర్ ఉండేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఫార్మూలా ఈ కారు రేసు కేసులో ఏసీబీ విచారణకు అనుమతివ్వాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో జనవరి 9న విచారణకు హాజరుకావాలని ఏసీబీ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. విచారణ సమయంలో లాయర్ తో కలిసి కూర్చొనే అవకాశం లేదని హైకోర్టు తెలిపింది. సీసీ టీవీ పర్యవేక్షణ లేదా కేటీఆర్ కనిపించేంత దూరంలో లాయర్ ఉండేందుకు కోర్టు అనుమతించింది.విచారణపై అభ్యంతరాలు ఉంటే మళ్లీ కోర్టుకు రావచ్చని హైకోర్టు తెలిపింది.
4. విశాఖలో బాబు, పవన్ తో మోదీ రోడ్ షో
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం సాయంత్రం విశాఖపట్టణం చేరుకున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు, అధికారులు ప్రధానికి ఘనంగా స్వాగతం పలికారు. తాటిచెట్లపాలెం, తెలుగుతల్లి ఫ్లైఓవర్, సిరిపురం వరకు మోదీ, బాబు, పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహించారు. ప్రజలకు అభివాదం చేస్తూ ఏయూ గ్రౌండ్స్ కు చేరుకున్నారు.
విశాఖలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.విశాఖ రైల్వే జోన్ కు శ్రీకారం చుడతారు. అనకాపల్లి జిల్లాలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్క్ కు శంకుస్థాపన చేశారు. రైల్వే లైన్లు, డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులతో పాటు జాతీయ రహదారులను జాతికి అంకితం ఇచ్చారు.
5. ఫార్మూలా ఈ కారు రేసు కేసు: ఏసీబీ విచారణకు అరవింద్ కుమార్, ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి
ఫార్మూలా ఈ కారు రేసు కేసులో ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్ బుధవారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఇదే కేసులో హెచ్ఎండీఏ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఫార్మూలా ఈ కారు రేసుకు సంబంధించి వీరిని దర్యాప్తు సంస్థలు ప్రశ్నించాయి. ఇదే కేసులో కేటీఆర్ ను ఏసీబీ జనవరి 9న విచారించనుంది. మరో వైపు ఈడీ అధికారులు అరవింద్ కుమార్ ను గురువారం విచారిస్తారు.
6. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు విందు భోజనంలో విషం
మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో ఇష్టం లేని పెళ్లి చేసుకుందని రిసెప్షన్ కోసం తయారు చేసిన భోజనంలో విషం కలిపారు ఓ వ్యక్తి. అయితే ఇది గమనించిన మరికొందరు అతడిని పట్టుకున్నారు. జిల్లాలోని ఉట్రే గ్రామానికి చెందిన వ్యక్తి మేనకోడలును చిన్నప్పటి నుంచి పెంచారు. అయితే ఆమె ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది.ఈ పెళ్లి అతనికి ఇష్టం లేదు. దీంతో రిసెప్షన్ కోసం తయారు చేసిన భోజనం విషం కలుపుతుండగా స్థానికులు చూసి అతడిని అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చే లోపుగా నిందితుడు పారిపోయారు.