PM Modi speech highlights: ఏపీపై తన అభిమానాన్ని చాటుకున్న ప్రధాని మోదీ... వైజాగ్ ఎలా అవుతుందంటే..
PM Modi speech highlights: ఏపీపై తన అభిమానాన్ని చాటుకున్న ప్రధాని మోదీ... వైజాగ్ ఎలా అవుతుందంటే..
PM Modi in Vizag visit: ఆంధ్ర ప్రజల ప్రేమ, అభిమానానికి నా కృతజ్ఞతలు. నా అభిమానాన్ని చూపించడానికి అవకాశం ఇప్పుడు లభించింది. ముందుగా సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహా స్వామి వారికి నమస్కరిస్తున్నాను. వైజాగ్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ తెలుగులో అన్న మాటలివి. తెలుగు పదాలను ఉచ్చరించడానికి మోడీ కొంత ఇబ్బంది పడినప్పటికీ ఆయనే స్వయంగా ఆ మాటలను గుర్తుంచుకుని తెలుగులో చెప్పిన తీరు ప్రత్యేకంగా అనిపించింది. తెలుగులో మాట్లాడి తెలుగు వారిని ఆకట్టుకునేందుకు ఇది ప్రధాని మోడీ చేసిన ప్రయత్నం. ఇక మిగతా స్పీచ్ మొత్తాన్ని కేంద్ర మంత్రి కింజారపు రామ్ మోహన్ నాయుడు తెలుగులో అనువదించారు.
మోదీ స్పీచ్ హైలెట్స్
వైజాగ్ ముఖ చిత్రాన్ని, ఏపీని అభివృద్ధి చేసేలా నేడు 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఇక్కడ ప్రారంభించడం జరుగుతోందన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగంలో చెప్పిన విషయాలన్నీ అర్థం చేసుకోగలనని, అలాగే ఆ సమస్యలను పరిష్కరించడానికి తను కృషి చేస్తానని మోదీ హామీ ఇచ్చారు.
కొత్తగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఏపీ ముందంజలో ఉండాలి. గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ కూడా అలా కొత్తగా ఎదుగుతున్న రంగం. 2030 నాటికల్లా దేశంలో 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకోసం కేంద్రం రెండు గ్రీన్ హైడ్రోజన్ హబ్స్ ఏర్పాటు చేస్తోంది. అందులో ఏపీలోని వైజాగ్ కూడా ఒకటని తెలిపారు.
భవిష్యత్తులో దేశంలో పేరొందిన ముఖ్యమైన నగరాల్లో ఒకటిగా వైజాగ్ ఒక వెలుగు వెలుగుతుందన్నారు. నక్కపల్లిలో నిర్మించతలపెట్టిన బల్క్ డ్రగ్ పార్క్ ప్రాజెక్టుతో మ్యానుఫాక్చరింగ్, రిసెర్చ్ రంగాల్లో అభవృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. దీంతో పరిశ్రమలు ఇక్కడ భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు మార్గం ఈజీ అవడమే కాదు... ఇక్కడి వారికి పెద్ద సంఖ్యలో ఉపాధి కూడా లభిస్తుందన్నారు.
పట్టణీకరణలో భాగంగా దేశంలోనే ఏపీని అగ్రభాగాన నిలబెట్టేలా క్రిష్ణపట్నం ఇండస్ట్రియల్ ఏరియా క్రిష్ సిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. చెన్నై, బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లో ఇది ఒక భాగం అవుతుంది. దీంతో వేల కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయన్నారు.
తయారీ రంగంలోనూ ఏపీ దేశంలోనేకెల్లా ముందుండాలన్నారు.
ఏపీ అభివృద్ధి కోసం ఎప్పటి నుండో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ డిమాండ్ ఉంది. ఆ చిరకాల కోరిక ఈరోజు తీరనుంది. సౌత్ కోస్ట్ ప్రధాన కార్యాలయం రాకతో ఇక్కడి వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుందన్నారు.
ఏపీలో రవాణా సౌకర్యాలను మెరుగుపర్చడం కోసం ఏపీలో 70కి పైగా రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ కింద అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. అలాగే దేశంలోని వివిధ నగరాలను అనుసంధానం చేస్తూ ఏడు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయన్నారు.
జీవన ప్రమాణాలు పెరుగుతాయని, వాణిజ్య సౌలభ్యం కూడా పెరుగుతుందన్నారు. 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికాభివృద్ధికి ఇది ఆధారం అవుతుందన్నారు.
వైజాగ్ సముద్ర తీరాన్ని ఉపయోగించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పర్చడం కోసం విశాఖ షిప్పింగ్ హార్బర్ ను మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.
మత్సకారులకు కిసాన్ క్రెడిట్ కార్జులిచ్చాం. సముద్రంలోనూ వారి భద్రతకు కృషి చేస్తున్నామని అన్నారు.నేడు ప్రారంభించే ఈ ప్రాజెక్టులు ఏపీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాని మోదీ చెప్పారు.