Delhi assembly election 2025: ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల బీమా.. కాంగ్రెస్ కొత్త పథకం..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి ఆమ్ ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మధ్య పోటీ ఉండనుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి ఆమ్ ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మధ్య పోటీ ఉండనుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ప్రచారాల్లో మునిగిపోయాయి. ఢిల్లీ వాసులకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే పలు పథకాలు అమలు చేస్తామని ప్రకటిస్తున్నాయి. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. జీవన్ రక్ష యోజన పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని హామీ ఇచ్చింది.
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ బుధవారం ఈ స్కీమ్‌ను ప్రకటించారు.రాజస్థాన్‌లో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ స్కీమ్‌ను అమలు చేశామని చెప్పారు. ఎలాంటి షరతులు, పరిమితులు లేకుండానే దీన్ని అమలు చేశామని తెలిపారు. ఢిల్లీకి కూడా ఈ పథకం ఓ గేమ్ ఛేంజర్ అవుతుందని అన్నారు. మరోవైపు ప్యారీ దీదీ యోజన అనే పథకం కింద ప్రతి మహిళకు ప్రతి నెల రూ.2500 ఇస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రచారంలో నువ్వా, నేనా అన్నట్టు దూసుకెళ్తున్నాయి. ఎన్నికల తేదీలు రావడంతో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. అటు అధికార ఆమ్ ఆద్మీ.. ఇటు ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ప్రచారంలో భాగంగా పార్టీలు హామీలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. ఆప్ తిరిగి సీఎం పీఠాన్ని దక్కించుకునేందుకు అనేక పథకాలను ప్రకటించింది. అటు బీజేపీ సైతం వరాల జల్లు కురిపిస్తోంది. ఇక దేశ రాజధానిలో పాగా వేయాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్.. ఢిల్లీ ప్రజలపై హామీలు ఇస్తోంది.