ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కొత్త చీఫ్ గా డాక్టర్ వి. నారాయణన్ నియమితులయ్యారు. ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ పదవీకాలంలో ముగుస్తుండటంతో ఈనెల 14వ తేదీన నారాయణన్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇస్రో అధిపతిగా బాధ్యతలు చేపట్టనున్న నారాయణన్ రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఆయన వలియమలాలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. రాకెట్ వ్యవస్థ, స్పేస్ క్రాఫ్ట్ ప్రొపల్షన్ కు సంబంధించి 4 దశాబ్దాలుగా పలు హోదాల్లో ఆయన పనిచేస్తున్నారు.
ఎల్పీఎస్సీ డైరెక్టర్ గా నారాయణన్ జీఎస్ ఎల్వీ ఎంకే 3కి సంబంధించి సీఈ20 క్రయోజెనిక్ ఇంజిన్ డెవలప్ చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. నారాయణన్ సారథ్యంలోనే పలు ఇస్రో మిషన్ ల కోసం ఎల్పీఎస్సీ ఇప్పటి వరకు 183 లిక్విడ్ ప్రొపల్షన్ వ్యవస్థలను, కంట్రోల్ పవర్ ప్లాంట్ లను అందించింది. పలు ఇస్రో ప్రాజెక్టుల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. వాటిల్లో ఆదిత్య స్పేస్ క్రాఫ్ట్ రూపకల్పన, జీఎస్ఎల్వీ ఎంకే 3 మిషన్ వంటి కీలకమైనవి ఉన్నాయి. నారాయణన్ సేవలను గుర్తిస్తూ ఆయనకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి.