Top 6 News @ 6PM: అల్లు అర్జున్ కు మరోసారి పోలీసుల నోటీసులు: మరో 5 ముఖ్యాంశాలు
అల్లు అర్జున్ కు(Allu Arjun) రామ్ గోపాల్ పేట పోలీసులు సోమవారం నోటీసులు ఇచ్చారు.
1. భారత్ లో 3 హెచ్ఎంపీవీ వైరస్ కేసులు: ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
భారత్ లో హ్యుమన్ మెటానిమోవైరస్ హెచ్ఎంపీవీ మూడు కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసులతో ఎలాంటి ఆందోళ చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇతర శ్వాసకోశ వ్యాధుల మాదిరిగానే ఈ వైరస్ తో కేసులు నమోదౌతాయని ఆరోగ్యశాఖ తెలిపింది. ఇన్ ఫ్లూయెంజా మాదిరి వ్యాధులు లేదా ఇతర శ్వాసకోశ వ్యాధులు అసాధారణ రీతిలో ఏం లేవని కేంద్ర ఆరోగ్యశాఖ వివరించింది. చిన్నారులు, వృద్దులో ఈ వైరస్ ఇన్ ఫెక్షన్ ఎక్కువగా ఉంటుందని కేంద్ర ఆరోగ్యసేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతల్ గోయల్ చెప్పారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ఆయన కోరారు.
2. అల్లు అర్జున్ కు రామ్ గోపాల్ పేట పోలీసుల నోటీసులు
అల్లు అర్జున్ కు(Allu Arjun) రామ్ గోపాల్ పేట పోలీసులు సోమవారం నోటీసులు ఇచ్చారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్ ఎప్పుడు రావాలనుకున్నా తమకు సమాచారం ఇవ్వాలని ఆ నోటీసులో కోరారు. 2023 డిసెంబర్ 4న సంధ్య థియేటర్ తొక్కిసలాటలో(Sandhya Theatre Stampede) రేవతి అనే మహిళ మరణించారు. ఆమె కొడుకు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
శ్రీతేజ్ ను అల్లు అరవింద్ పరామర్శించారు. ఎఫ్ డీ సీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) పరామర్శించి ఆ కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించారు. మరో వైపు అల్లు అర్జున్ మాత్రం ఆ చిన్నారిని పరామర్శించలేదు.
ఆసుపత్రి సిబ్బంది సూచనతోనే ఆయన అక్కడికి రాలేదని అల్లు అరవింద్ గతంలో మీడియాకు తెలిపారు. డిసెంబర్ 5న అల్లు అర్జున్ శ్రీతేజ్ ను పరామర్శించేందుకు వస్తున్నారనే ప్రచారం సాగింది. శ్రీతేజ్ ను పరామర్శించేందుకు వచ్చే ముందు తమకు సమాచారం ఇవ్వాలని ఆ నోటీసులో కోరారు. ముందస్తు సమాచారం లేకుండా వస్తే ఏదైనా జరిగితే అందుకు బాధ్యత మీరే వహించాలని ఆ నోటీసులో తెలిపారు.
అల్లు అర్జున్ కు సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ ను జనవరి 3న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. సంధ్య థియేటర్ కేసులో గతంలోనే తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించాలని కోర్టు ఆదేశించింది.
3. ఫార్మూలా ఈ కారు రేసులో: తెరపైకి విరాళాల అంశం
ఫార్మూలా ఈ కారు రేసు కేసులో జనవరి 6న కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో తన న్యాయవాదిని అనుమతించని కారణంగా కేటీఆర్ విచారణకు హాజరుకాలేదు. కానీ ఏసీబీ అధికారులకు ఆయన ఓ లేఖను ఇచ్చారు. కోర్టు ఆదేశాల్లో అడ్వకేట్ ను అనుమతించాలని లేదని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. అడ్వకేట్ ను విచారణకు తీసుకెళ్లడం తన హక్కు అని కేటీఆర్ వాదించారు. అడ్వకేట్ ను అనుమతించని కారణంగా ఏసీబీ నోటీసుకు ఆయన సమాధానంగా లేఖను ఇచ్చి వెళ్లిపోయారు. అయితే మరో వైపు బీఆర్ఎస్ కు ఫార్మూలా ఈ కారు రేసు ప్రమోటర్ గా ఉన్న గ్రీన్ కో దాని అనుబంధ సంస్థలు బీఆర్ఎస్ కు 41 కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో విరాళాలు అందించాయని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ఈ సంస్థల నుంచి విరాళాలు బీఆర్ఎస్ కు అందిన విషయం వాస్తవమేనని కేటీఆర్ మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలకు కూడా గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థల నుంచి విరాళాలు అందాయని ఆయన ఆరోపించారు. వాటిని కూడా తాము మీడియాకు అందిస్తామన్నారు. మరో వైపు కేటీఆర్ నివాసంలో ఏసీబీ సోదాలు జరిగాయని మీడియాల్లో కథనాలు వచ్చాయి.
4. హెచ్ఎంపీవీ వైరస్ భయం: కుప్పకూలిన స్టాక్ మార్కెట్, 12 లక్షల కోట్ల నష్టం
హెచ్ఎంపీవీ వైరస్ కేసుల భయంతో భారత్ స్టాక్ మార్కెట్లు జనవరి 6న కుప్పకూలాయి.సెన్సెక్స్ 1258 పాయింట్లు, నిఫ్టీ 388 పాయింట్లు నష్టపోయాయి. బీఎస్ఈలో కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.12 లక్షల కోట్ల మేర క్షీణించి రూ.439 లక్షల కోట్లకు చేరింది. హెచ్ఎంపీ వైరస్ కేసులు భారత్ లో మూడు నమోదయ్యాయి. దీంతో స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. ఇంట్రాడేలో 77,781.62 పాయింట్ల కనిష్టాన్ని తాకిన సూచీ.. చివరకు 1258.12 పాయింట్ల నష్టంతో 77,964.99 వద్ద ముగిసింది. నిఫ్టీ 388.70 పాయింట్లు నష్టపోయి 23,616.05 వద్ద స్థిరపడింది.
5. బంగ్లా మాజీ ప్రధాని హసీనాపై ఐసీటీ అరెస్ట్ వారంట్
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ సోమవారం మరో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.ఆమెతో పాటు మరో 12 మంది పేర్లను కూడా ఇందులో చేర్చారు. పలువురి అదృశ్యాలు, హత్యలకు సంబంధించి ఈ వారంట్ జారీ అయింది. వీరిని 2025 ఫిబ్రవరి 12 లోపుగా కోర్టు ముందు హాజరుపర్చాలని ఆదేశించారు.హసీనాపై తొలి వారంట్ నవంబర్ 18, 2024లో జారీ అయింది. తాజాగా మరో వారంట్ జారీ చేశారు.
6. ఛత్తీస్ గఢ్ లో భద్రతా దళాల వాహనం పేల్చిన మావోలు: 10మంది మృతి
ఛత్తీస్ గడ్ బీజాపూర్ లో మావోయిస్టులు మందుపాతర పేల్చిన ఘటనలో 10 మంది మరణించారు. ఇందులో 9 మంది జవాన్లు కాగా, మరొకరు వాహన డ్రైవర్.సుక్మా జిల్లా కుత్రు అటవీ ప్రాంతంలోని బెద్రే- కుత్రు రోడ్డులో కూంబింగ్ నుంచి తిరిగి వెళ్తున్న పోలీసుల వాహనాన్ని మావోయిస్టులు మందుపాతరతో పేల్చివేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో వాహనంలో 20 మంది జవాన్లు ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన జవాన్లను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం బస్తర్ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు.