BPSC Exam Row: ప్రశాంత్ కిషోర్ ఆమరణ నిరాహార దీక్ష భగ్నం.. ఎయిమ్స్‌కు తరలింపు
Prashant Kishor: జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ (prashant kishor)ఆమరణ నిరాహార దీక్ష(Fast unto death)ను పోలీసులు భగ్నం చేశారు.
Prashant Kishor: జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ (prashant kishor)ఆమరణ నిరాహార దీక్ష(Fast unto death)ను పోలీసులు భగ్నం చేశారు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు రోజులుగా గాంధీ మైదాన్‌లో ఆయన ఆమరణ దీక్ష చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున ప్రశాంత్ కిషోర్ ను అదుపులోకి తీసుకుని ఆయనను ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
పోలీసులతో వెళ్లేందుకు ప్రశాంత్ కిషోర్ నిరాకరించడంతో బలవంతంగా ఆయనను అక్కడి నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో గాంధీ మైదాన్ వద్ద వేదికను పోలీసులు ఖాళీ చేయించారు. దీంతో పార్టీ శ్రేణులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ఇటీవల బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో ఆ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రశాంత్ కిషోర్ జనవరి 2న గాంధీ మైదానంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. గత రెండు వారాలుగా బీపీఎస్సీ అభ్యర్థులు తీవ్ర ఆందోళనలు చేపడుతున్నా ప్రభుత్వంలో ఎలాంటి కదలిక రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసి మళ్లీ కొత్తగా పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు.
డిసెంబర్ 13న నిర్వహించిన బీపీఎస్సీ కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో నిరుద్యోగులు ఆందోళన కొననసాగిస్తున్నారు. పరీక్షను రద్దు చేసి కొత్తగా మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. పరీక్షను రద్దు చేసే ప్రసక్తే లేదని అధికారులు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో విద్యార్థులు ఆందోళనల్ని ఉధృతం చేయగా.. ప్రశాంత్ కిషోర్ వాళ్లకు మద్దతుగా నిలిచారు.