HMPV cases in India: హెచ్ఎంపీవీ వైరస్ భారత్ సహా అంతటా ఉంది... అప్రమత్తమైన ICMR
ICMR about HMPV cases in India: చైనాను వణికిస్తోన్న హ్యూమన్ మెటాన్యూమో వైరస్ ప్రపంచం అంతటా వ్యాపించిందని, అందులో భారత్ కూడా ఉందని భారతీయ వైద్య పరిశోధన మండలి అభిప్రాయపడింది. అయితే, వైరస్ వ్యాప్తి వల్ల కేసులు పెరిగితే, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉందని ఐసిఎంఆర్ స్పష్టంచేసింది. ఇవాళ తొలిసారిగా భారత్‌లో రెండు హెచ్ఎంపీవీ కేసులు వెలుగుచూడటంతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ ఈ ప్రకటన విడుదల చేసింది.
బెంగళూరులో నెలల వయస్సున్న ఇద్దరు చిన్నారుల్లో హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. వారిలో 3 నెలల వయస్సున్న పసికందు ఇప్పటికే ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. 8 నెలల వయస్సున్న చిన్నారి ప్రస్తుతం హ్యూమన్ మెటాన్యూమో వైరస్ నుండి కోలుకుంటున్నారు. ఈ రెండు కేసుల్లోనూ చిన్నారుల్లో కానీ లేదా వారి కుటుంబాల్లో కానీ విదేశీ ప్రయాణం చేసిన దాఖలాలు లేవు. దీంతో వారికి హ్యూమన్ మెటాన్యూమో వైరస్ ఎలా సోకిందనే కోణంలో డాక్టర్లు ఆరా తీస్తున్నారు.