ఉత్తరాఖండ్‌లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

* ఇంకా లభించని 179 మంది ఆచూకీ * 36కి చేరిన మృతుల సంఖ్య * రెస్క్యూ టీంకు అడ్డంకిగా మారిన బురద

Update: 2021-02-11 02:28 GMT

file image (the Hans India)

 ఉత్తరాఖండ్‌లో వరుసగా నాలుగు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. చిమ్మ చీకట్లో కూడా ప్రాణాలకు తెగించి సహాయక సిబ్బంది గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. అయినప్పటికి ఇంకా 179 మంది కార్మికుల ఆచూకీ లభించలేదు.. మరోవైపు జల విలయానికి బలైన వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఉత్తరాఖండ్‌లో హిమానీనది ఉప్పొంగడంతో మృతి చెందిన వారి సంఖ్య 36కు చేరింది. తొలగిస్తున్న కొద్దీ బురద గుట్టలు గుట్టలుగా జారిపడుతోంది. గల్లంతైన కార్మికుల కుటుంబసభ్యులు అల్లాడిపోతున్నారు. నాలుగు రోజుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు.

ఒక్క తపోవన్‌ టన్నెల్‌ వద్దే 35 మంది వరకు జాడ తెలియడం లేదు. వారికోసం సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. ఐటీబీపీ, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఆర్మీబృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇంకా జాడ తెలియని వారి కోసం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది.

మృతదేహాలను కనుగొనేందుకు జేబీసీలు, అధునాతన యంత్రాలతో బురదను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. 150 మీటర్ల వరకు బురదను తొలగించారు. ఐతే తపోవన్‌ టన్నెల్‌ వద్ద రెస్క్యూ ఆపరేషన్‌కు అడ్డంకులు ఎదురవుతున్నాయి. తీస్తున్న కొద్దీ లోపలి నుంచి మట్టి జారిపడుతోంది.

 ఇక ఉత్తరాఖండ్‌ జల ప్రళయంతో సమీప ప్రాంత ప్రజలకు రాకపోకలు స్తంభించిపోయాయి. తపోవన్‌ వద్ద ఓ బ్రిడ్జి కొట్టుకుపోవడంతో అక్కడున్న గ్రామానికి రాకపోకలకు వీల్లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో వారి కోసం రోప్‌ వేను ఏర్పాటు చేస్తున్నారు. హెలికాప్టర్లతో నిత్యావసరాలు సరఫరా చేస్తున్నారు. హిమనీనదం సృష్టించిన జలవిలయంతో పలు గ్రామాలకు.. బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కొండ ప్రాంతాల్లో నడుచుకుంటూ వెళ్లి.. వారికి ఆహార పదార్థాలను అందిస్తున్నారు.

 జలప్రళయం ధాటికి ఛమోలీ సహా చుట్టుపక్కల గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విష్ణుప్రయాగ్​లోని పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. గోడలకు బీటలు వారాయి. రిషిగంగ ప్రాజెక్ట్​ దగ్గర పనిచేసే సుమారు 40 మంది కార్మికుల కుటుంబసభ్యులు నిరసనకు దిగారు. అలకనందా నదీ వద్ద జలవిలయం అనంతరం సహాయక చర్యలు సక్రమంగా చేపట్టలేదని ఆరోపించారు. ప్రాజెక్ట్ అధికారులతో వాగ్వాదానికి దిగారు.

Tags:    

Similar News