Jallikattu: జల్లికట్టు ఆటలో నిబంధనలు.. గైడ్ లైన్స్ ప్రవేశపెట్టిన తమిళనాడు సర్కార్
Jallikattu: ఎద్దు కొమ్ములకు ప్లాస్టిక్ లేదా... రబ్బర్ తొడుగులు అమర్చాలని నిర్ణయం
Jallikattu: జల్లికట్టు తమిళనాడులో ప్రసిద్ధి చెందిన సాంప్రదాయ ఎద్దులను మచ్చిక చేసుకునే క్రీడ. ఇది సాధారణంగా ప్రతి పొంగల్ పండుగ సమయంలో జరుగుతుంది. ఈ క్రీడలో ఒక ఎద్దును మూపురంపై పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎవరు ఎంత ఎక్కువ సేపు పట్టుకుంటే... వారే విజేతగా నిర్ణయిస్తారు. అయితే... ఈ జల్లికట్టు క్రీడలో ఎద్దుకు ఎటువంటి హానీ జరగకపోయినా... జంతు సంరక్షణ., భద్రతకు సంబంధించి జంతు ప్రేమికుల ఆందోళనల కారణంగా జల్లికట్టు వివాదాస్పద క్రీడగా మారింది.
సంక్రాంతి సందర్భంగా ఏటా తమిళనాడులోని మదురై, పుదుకొట్టై, తంజావూర్ జిల్లాల్లో వైభవంగా జల్లికట్టును నిర్వహిస్తారు. కొన్ని సార్లు ఘర్షణ ఘటనలు జరిగిన కారణంగా జల్లికట్టుపై అనేకసార్లు న్యాయస్థానాలు స్టే విధించాయి. అయినా ప్రజలు జల్లికట్టు నిర్వహిస్తూనే ఉన్నారు. దీనికి తమిళనాడు ప్రభుత్వం కూడా పూర్తి మద్దతు పలికింది. ఎద్దు కొమ్ముల కారణంగా అనేక మంది గాయాలపాలవుతున్నారని.. అడపాదడపా చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయని... స్థానిక ప్రభుత్వానికి పలు సంఘాలు మొరపెట్టుకున్నాయి. దీంతో దిగొచ్చిన తమిళనాడు ప్రభుత్వం... జల్లికట్టు ఆటలో కొన్ని నిబంధనలు... గైడ్ లైన్స్ ప్రవేశపెట్టింది.
జల్లికట్టు పోటీల్లో ఎవరూ తీవ్రంగా గాయపడకుండా... ప్రాణనష్టం సంభవించకుండా చూసేందుకు స్టాలిన్ సర్కార్ సన్నద్ధమయ్యింది. ఎద్దులను లొంగదీసే క్రమంలో అవి పొడిచినా... ఎదుటి వారికి గాయాలు కాకుండా వాటి కొమ్ములకు రబ్బరు లేదా ప్లాస్టిక్ తొడుగులను అమర్చాలని రాష్ట్ర ప్రభుత్వం, జంతు సంక్షేమ బోర్డు నిర్ణయించాయి. ఈ ఏడాది నిర్వహించే జల్లికట్టు నుంచే వీటిని వినియోగించాలని సూచించాయి. జల్లికట్టు ఆటలో ఎద్దుకు ఎలాంటి హానీ కలిగించకూడదని... బయటి వ్యక్తి పాల్గొనాలంటే వారికి కనీసం 18 సంవత్సరాలు పూర్తై ఉండాలనే నియమాన్ని ప్రవేశపెట్టారు. జల్లికట్టు ఆడే సమయంలో మద్యం లేదా డ్రగ్స్ ప్రభావంతో పోటీలో పాల్గొనకూడదని నిబంధనలు విధించాయి. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి కఠినమైన జరిమానాలు విధించాలని గైడ్ లైన్స్ తీసుకొచ్చాయి.