SII announcement on Vaccine Supply: అందరికీ వ్యాక్సిన్ అందాలంటే నాలుగేళ్లు..

SII announcement on Vaccine Supply | ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతోంది.

Update: 2020-09-15 04:30 GMT

SII announcement on Vaccine Supply | ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతోంది. ఎక్కడా కేసులు తగ్గిన దాఖలాలు లేవు. రోజురోజుకూ ఇవి మరింత పెరుగుతూ వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్ రూపొందించడం, వాటి తయారీపై ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే దీనిపై వ్యాక్సిన్ తయారు చేస్తున్న సీరం ఇనిస్టిట్యూట్ ఆప్ ఇండియా సీఈవో ఒక ప్రకటన చేశారు. ప్రపంచం మొత్తం ఈ వ్యాక్సిన్ పంపిణీ చేయాలంటే నాలుగేళ్లు పడుతుందన్నారు. వీటి తయారీకి సంబంధించి ప్రత్యేక ప్రణాళికలు లేకపోవడమే దీనికి కారణమన్నారు. ఇదిలా ఉండగా వ్యాక్సిన్ వచ్చే ఏడాది ప్రారంభంలో అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ ప్రకటించారు. వీటిని విడతలుగా అందరికీ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ను ప్రపంచ జనాభా అంతటికీ అందించేందుకు నాలుగైదేళ్ల సమయం పడుతుందని సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) సీఈఓ ఆధార్‌ పూనావాలా పేర్కొన్నారు. 2024 వరకూ కరోనా వ్యాక్సిన్‌ కొరత ప్రపంచాన్ని వెంటాడుతుందని హెచ్చరించారు. ప్రపంచ జనాభా మొత్తానికి సరిపోయేలా వ్యాక్సిన్ తయారీ సామర్థ్యాన్ని ఫార్మా కంపెనీలు పెంచడంలేదని వాపోయారు.

దేశవ్యాప్తంగా 140 కోట్ల మందికి వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు అవసరమైన కోల్డ్‌చైన్‌ మౌలిక సదుపాయాలు లేవని భారత్‌లో వ్యాక్సిన్‌ పంపిణీపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 40 కోట్లకు మించిన డోసులపై మన దగ్గర ఇప్పటికీ ఎలాంటి ప్రణాళిక లేదని, దేశానికి అవసరమైన వ్యాక్సిన్‌ తయారీ సామర్థ్యం మనకున్నా దాన్ని వినియోగించుకోలేని దుస్థితిలో మనం ఉండరాదని ఫైనాన్షియల్‌ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ రెండు డోసుల కార్యక్రమంగా చేపడితే ప్రపంచవ్యాప్తంగా 1500 కోట్ల డోసుల కోవిడ్‌-19 వ్యాక్సిన్లు అవసరమని చెప్పారు.

కాగా, కరోనా వైరస్‌ వ్యాక్సిన్ల తయారీకి ఆస్ర్టాజెనెకా సహా ఐదు అంతర్జాతీయ ఫార్మా కంపెనీలతో సీరం ఒప్పందాలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ర్టాజెనెకా కోవిడ్‌-19 వ్యాక్సిన్‌కు సంబంధించి 100 కోట్ల డోసులను తయారు చేసేందుకు ఎస్‌ఐఐ సంసిద్ధమైంది. వీటిలో సగం భారత్‌లో సరఫరా చేస్తారు. ఇక ఇటీవల నిలిచిపోయిన ఈ వ్యాక్సిన్‌ మూడో దశ క్లినికల్‌ పరీక్షలకు వైద్య నియంత్రణ మండలి అనుమతి లభించడంతో పున:ప్రారంభమయ్యాయి.

కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ వచ్చే ఏడాది మొదట్లో వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ చెప్పారు. టీకా భద్రతపై ఎవరికీ సందేహాలు, ఆందోళనలు లేకుండా తానే మొదటి డోసు తీసుకుంటానని స్పష్టం చేశారు. ఆదివారం సామాజిక మాధ్యమాల వేదికగా సండే సంవాద్‌ కార్యక్రమంలో మంత్రి తన ఫాలోవర్లతో ముచ్చటించారు. నెటిజన్లు అడిగిన పలు సందేహాలకు ఆయన జవాబులిచ్చారు. ప్రస్తుతం కోవిడ్‌ పరిస్థితి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కోవిడ్‌ తదనంతర ప్రపంచం ఎలా ఉంటుందన్న దానిపై మాట్లాడారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ ప్రయోగాలు బ్రిటన్‌లో మళ్లీ మొదలైన నేపథ్యంలోనే హర్షవర్ధన్‌ కరోనా వ్యాక్సిన్‌పై వివరంగా మాట్లాడారు. డీసీజీఐ అనుమతులు ఇచ్చాక సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ భారత్‌లో కూడా ప్రయోగాలు ప్రారంభించనుంది.

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకే మొదటి ప్రాధాన్యం

కరోనా వ్యాక్సిన్‌ ఎవరికైతే∙అత్యవసరమో వారికే ముందు లభిస్తుందని హర్షవర్ధన్‌ చెప్పారు. ఆర్థికంగా వారికి టీకా కొనుగోలు చేసే శక్తి ఉన్నా లేకపోయినా సీనియర్‌ సిటిజన్లు, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు తొలి ప్రాధాన్యం ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. ''2021 మొదటి నాలుగు నెలల్లోనే కరోనాకి వ్యాక్సిన్‌ వచ్చే అవకాశాలున్నాయి. ప్రజల్లో టీకా భద్రతపై భయాలుంటే నేను మొదట వ్యాక్సిన్‌ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు, సీనియర్‌ సిటిజన్లకి మొదట వ్యాక్సిన్‌ లభించేలా కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుంది''అని హర్షవర్ధన్‌ వెల్లడించారు. టీకా భద్రత, నాణ్యత, ధర, ఉత్పత్తి, సరఫరా వంటి అన్ని అంశాల్లోనూ ఇప్పటికే విస్తృత స్థాయిలో చర్చలు పూర్తయ్యాయని తెలిపారు.

47 లక్షలు దాటిన కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా జోరు తగ్గడం లేదు. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 94,372 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 47,54,356 కు చేరుకుంది. ఇటీవల మూడు రోజుల నుంచి వరుసగా 90 వేలకు పైగ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 1,114 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 78,586కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 37,02,595కు చేరుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 9,73,175గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 20.47 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 77.88 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Tags:    

Similar News