Baba Siddiqui Murder Case: అప్పుడు చేతికి చిక్కినా వదిలేశారు.. ఇప్పుడు దేశం నలుమూలలా గాలిస్తున్నారు

Update: 2024-10-15 09:47 GMT

Baba Siddiqui Murder Case Latest News Updates: బాబా సిద్ధిఖి మర్డర్ కేసుకి, సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులకు పాల్పడిన ఘటనకు కనెక్షన్ ఉన్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఆ కనెక్షన్ ఏంటో తెలియాలంటే ముందుగా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో సల్మాన్ ఖాన్ ఇంటిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులకు పాల్పడిన ఘటనను గుర్తుచేసుకోవాలి. సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల ఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. బాల్కనీలో ఖాళీ బుల్లెట్ షెల్ కూడా లభ్యమైంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. సల్మాన్ ఖాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరించిన నేపథ్యంలో ఈ కాల్పులకు పాల్పడిన నిందితులకు, లారెన్స్ గ్యాంగ్‌కి మధ్య ఉన్న సంబంధాలపై ఆరాతీశారు. ఈ మొత్తంలో దర్యాప్తులో ముంబై పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని వారిని ప్రశ్నించారు.

అలా పోలీసులకు చిక్కిన శుభం లోంకర్..

సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల ఘటనలో శుభం లోంకర్ అనే యువకుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. శుభం లోంకర్‌కి లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నందున అతడే ఈ నేరానికి పాల్పడ్డాడా అనే కోణంలో ఈ విచారణ జరిగింది. కానీ శుభం లోంకర్‌ని అరెస్ట్ అయితే చేశారు కానీ అతడే ఈ నేరానికి పాల్పడినట్లుగా ముంబై పోలీసులు సరైన సాక్ష్యాధారాలు చూపించలేకపోయారు. దీంతో అతడిని విడిచిపెట్టక తప్పలేదు.

అదే వ్యక్తి ఇప్పుడు బాబా సిద్ధిఖి మర్డర్ కేసులో కీలక సుత్రధారి?

బాబా సిద్ధిఖి మర్డర్ కేసులో లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్‌తో సన్నిహిత సంబంధాలున్న మొహమ్మద్ జీషాన్ అఖ్తర్, అలాగే శుభం లోంకర్‌లను కీలక సూత్రధారులుగా ముంబై పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరి కోసం ముంబై యాంటీ-ఎక్స్‌టార్షన్ సెల్ పోలీసులు అంతటా గాలిస్తున్నారు. ఈ ఇద్దరి కాంటాక్ట్స్, నెట్‌వర్క్ ఎక్కడెక్కడి వరకు ఉన్నాయో, అక్కడక్కడికి ముంబై పోలీసు బృందాలు వెళ్లి గాలింపు చర్యలు చేపట్టాయి.

మొత్తానికి సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులో అతడి పాత్రే కీలకమని బలంగా నమ్మిన ముంబై పోలీసులు... అందుకు బలమైన సాక్ష్యాధారాలు మాత్రం చూపించలేకపోయారు. అలా అప్పుడు అతడిపై అనుమానం ఉన్నప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో కేవలం ప్రశ్నించి వదిలేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు బాబా సిద్ధిఖి మర్డర్ కేసులో అదే వ్యక్తిని పట్టుకునేందుకు మరోసారి దేశం నలుమూలలా గాలిస్తున్నారు.

Tags:    

Similar News