ప్రణబ్‌కు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ
అనారోగ్యంతో ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే..
అనారోగ్యంతో ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీలోని లోథి ఎస్టేట్‌లో జరగనున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రణబ్ ముఖర్జీ.. ఆయన నివాసానికి చేరుకొని ప్రణబ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అలాగే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్, త్రివిధ దళాధిపతుల తోపాటు పలువురు కాంగ్రెస్ ప్రముఖులు కూడా ప్రణబ్ చిత్రపటానికి అంజలి ఘటించారు.
ఈ సందర్బంగా ప్రణబ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు ప్రధాని నరేంద్రమోదీ. ఈ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రణబ్ పార్థీవ దేహాన్ని ప్రజల సందర్శనార్ధం ఉంచారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ప్రణబ్ అంతిమయాత్ర ప్రారంభం అవ్వనుంది. మధ్యాహ్నం 2 గంటలకు లోధి రోడ్డులోని శ్మశానవాటికలో ప్రణబ్ అంత్యక్రియలు జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రణబ్ అంత్యక్రియలను వీక్షించడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాగా ప్రణబ్ ను ఆఖరిసారిగా చూసేందుకు అభిమానులు, కాంగ్రెస్ అగ్రనేతలు, కార్యకర్తలు ప్రణబ్ నివాసానికి చేరుకుంటున్నారు. దీంతో పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. కరోనాను దృష్టిలో ఉంచుకొని మరోవైపు ఎక్కువమంది ఒకేసారి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా బారిన పడి నెలరోజుల పాటు మృత్యువుతో పోరాడిన ప్రణబ్ ముఖర్జీ సోమవారం సాయంత్రం కన్నుమూసిన విషయం తెలిసిందే.