Top 6 News @ 6PM: ఎవరైనా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే తొక్కి నార తీస్తానన్న పవన్ కళ్యాణ్
ఎవరైనా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే తొక్కి నార తీస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.
1.తిరుమల తొక్కిసటాలపై టీటీడీ ఛైర్మన్ క్షమాపణలు చెప్పాలి:పవన్ కళ్యాణ్
ఎవరైనా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే తొక్కి నార తీస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురం మండలం కుమారపురంలో గోకులం షెడ్లను ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. తిరుమలలో తొక్కిసలాటపై టీటీడీ ఛైర్మన్, సభ్యులు ప్రెస్ మీటి పెట్టి క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు. తాను క్షమాపణ చెప్పినప్పుడు మీరు చెప్పడానికి నామోషీ ఏంటి అని ఆయన ప్రశ్నించారు. చేయని తప్పునకు జపాన్ ప్రధాని క్షమాపణ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తిరుమలలో వీఐపీ ట్రీట్ మెంట్ తగ్గి కామన్ మ్యాన్ ట్రీట్ మెంట్ పెరగాలని ఆయన కోరారు.
2.ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు ఊరట
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో మాజీ మంత్రి హరీశ్ రావును జనవరి 28 వరకు అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ తన ఫోన్ ట్యాపింగ్ చేశారని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకే తన ఫోన్ ట్యాపింగ్ చేశారని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై డిసెంబర్ 3, 2024న హరీశ్ రావుపై కేసు నమోదైంది. ఈ కేసుపై హరీశ్ రావు తెలంగాణ హైకోర్టులో డిసెంబర్ 5, 2024న పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. అదే పిటిషన్ పై శుక్రవారం కోర్టు విచారించింది. ఈ నెల 28 వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది.
3.బీజేపీ మాజీ ఎమ్మెల్యే హర్వాన్ష్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు
మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే హిర్వాన్ష్ సింగ్ రాథోడ్ ఇంట్లో ఐటీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేతకు సంబంధించి ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన ఇంట్లో సోదాలు చేశారు. రాథోడ్ తో పాటు మాజీ కౌన్సిలర్ రాజేశ్ కేశర్వాణి ఇంట్లో కూడా సోదాలు చేశారు. రాథోడ్ రూ. 155 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి.
4. ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వవద్దు: తెలంగాణ హైకోర్టు
గేమ్ ఛేంజర్ సినిమాకు టికెట్ల ధర పెంపు, ప్రత్యేక షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాత్రి 1 గంట తర్వాత, తెల్లవారుజామున ప్రత్యేక షోలకు అనుమతివ్వడాన్ని ప్రశ్నించింది. దీనిపై పున:సమీక్షించాలని హైకోర్టు హోంశాఖ కార్యదర్శిని ఆదేశించింది. ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని బెనిఫిట్ , ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వవద్దని తెలంగాణ హైకోర్టు సూచించింది. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా 2024 డిసెంబర్ 4న సంధ్య థియేటర్ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించారు.ఆమె కొడుకు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ ఘటనతో బెనిఫిట్ షో, టికెట్ రేట్ పెంపు ఉండదని ప్రభుత్వం ప్రకటించింది. కానీ గేమ్ ఛేంజర్ సినిమాకు మాత్రం టికెట్ రేట్లను పెంపునకు, ప్రత్యేక షోలకు అనుమతించింది.
5.హష్ మనీ కేసు: సుప్రీంకోర్టులో ట్రంప్ నకు ఎదురుదెబ్బ
పోర్న్ స్టార్ కు హష్ మనీ కేసులో డోనాల్డ్ ట్రంప్ నకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తనకు శిక్ష విధిస్తానని న్యూయార్క్ న్యాయమూర్తి జారీ చేసిన ఆదేశాలను అడ్డుకోవాలని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అభ్యర్ధనను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. శుక్రవారం ట్రంప్ నకు న్యూయార్క్ కోర్టు జడ్జి జువాన్ ఎం. మెర్చన్ శిక్షను విధిస్తారు.2024 నవంబర్ లో ట్రంప్ నకు న్యూయార్క్ కోర్టు హష్ మనీ కేసులో శిక్షణు ఖరారు చేయాల్సి ఉంది. అయితే అదే సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచారు. దీంతో ఈ కేసులో తీర్పును వాయిదా వేయాలని ట్రంప్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్నవారికి క్రిమినల్ విచారణ నుంచి రక్షణ ఉంటుందని ఆయన తన పిటిషన్ లో కోరారు.అయితే ఇలాంటి కేసుల్లో అధ్యక్షుడికి ఎలాంటి మినహాయింపులు ఉండవని సుప్రీంకోర్టు ట్రంప్ అభ్యర్ధనను తోసిపుచ్చింది. 2025 జనవరి 10న ట్రంప్ నకు శిక్ష విధిస్తామని న్యూయార్క్ జడ్జి తెలిపారు. అయితే శిక్ష అనుభవించాల్సిన అవసరం లేకుండా డిశ్చార్జిని అమలు చేస్తామని ఆయన ప్రకటించారు.
6.పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్
పరువు నష్టం కేసులో లోక్ సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీకి పుణె ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.సావర్కర్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్ పై పరువు నష్టం కేసు నమోదైంది. ఈ కేసుపై రాహుల్ గాంధీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై మధ్యప్రదేశ్ ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు జనవరి 10న బెయిల్ మంజూరు చేసింది. రూ. 25 వేల పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది.