Gujarat Bridge Collapse: మోర్బీలో వంతెన కూలిన ఘటన..141కు చేరిన మృతుల సంఖ్య
*ప్రమాద స్థలానికి ఇవాళ ప్రధాని మోడీ వెళ్లనున్నారు
Gujarat Bridge Collapse: గుజరాత్‌లోని మచ్చు నదిపై తీగల వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య 141కి చేరింది. మృతుల్లో 46 మంది చిన్నారులుండగా మరో 100 మందికిపైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బ్రిడ్జి కూలిన ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేశామని, ఇప్పటి వరకు ఘటనకు బాధ్యులుగా 9 మందిని అరెస్ట్ చేసినట్టు గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో బ్రిడ్జి కాంట్రాక్టర్, టికెట్ క్లర్కులు కూడా ఉన్నారు. వీరిందరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసు అధికారులు తెలిపారు.
వంతెన మరమ్మతు పనులు చేసిన వారికి సరైన లైసెన్స్ లేదని అధికారులు వెల్లడించారు. అలాగే ఈ ఘటనపై విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఇక ఈ ఘటనకు పూర్తి బాధ్యత తమదేనని రాష్ట్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి బ్రిజేష్ మెర్జా ప్రకటించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు గుజరాత్ ప్రభుత్వం 4 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు, గాయపడిన వారికి 50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ప్రమాద స్థలానికి ఇవాళ ప్రధాని మోడీ వెళ్లనున్నారు. ఈ విషయాన్ని గుజరాత్ సీఎంవో వెల్లడించింది.