యమునోత్రి వెళ్లే దారిలో కూలిన రక్షణ గోడ.. రోడ్డుపైనే చిక్కుకున్న 10వేల మంది..
Yamunotri Highway: నాలుగు పవిత్ర పుణ్య క్షేత్రాల్లో ఒకటైన యమునోత్రికి బ్రేక్ పడింది.
Yamunotri Highway: నాలుగు పవిత్ర పుణ్య క్షేత్రాల్లో ఒకటైన యమునోత్రికి బ్రేక్ పడింది. ఉత్తరాఖండ్‌లోని ఈ క్షేత్రానికి వెళ్లే మార్గంలో రహదారి భద్రతా గోడ కూలిపోయింది. దీంతో రిషికేశ్- యమునోత్రి జాతీయ రహదారిపై బ్లాక్ అయింది. జంకిచట్టి వద్ద భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. యమునోత్రికి వెళ్లే 10 వేల మందికి పైగా యాత్రికులు ఈ మార్గంలో చిక్కుకున్నారు. ఈ రహదారిలో కూలిన గోడ శిథిలాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించడానికి కనీసం మూడు రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
అయితే ఇప్పటికే కొంత మరమ్మతులు చేశారు. చిన్న చిన్న వాహనాలను పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ వాహనాలను పంపేందుకు ఇంకా సమయం పడుతుందని అందులో వెళ్లే యాత్రికులకు మాత్రం ఇబ్బందులు తప్పవని అధికారులు చెబుతున్నారు. రెండుమూడు రోజులుగా ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సయనచట్టి, రణచట్టి మధ్య ఉన్న రహదారి వరదల్లో కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలను మూసేశారు. రెండ్రోజుల క్రితం మార్గాన్ని పునరుద్ధిరించారు. అంతలోనే రోడ్డు భద్రత గోడ కూలిపోవడంతో తాజాగా మళ్లీ యమునోత్రి మార్గంలో రాకపోకలను అధికారులు నిలిపేశారు.