సరిహద్దుల్లో చనిపోయిన రైతుల వివరాల్లేవ్.. పరిహారం ఇచ్చేది లేదన్న..
Narendra Singh Tomar: ఢిల్లీ సరిహద్దుల్లో మరణించిన రైతులకు పరిహారం ఇచ్చే ప్రశ్నే లేదని కేంద్రం ప్రకటించింది.
Narendra Singh Tomar: ఢిల్లీ సరిహద్దుల్లో మరణించిన రైతులకు పరిహారం ఇచ్చే ప్రశ్నే లేదని కేంద్రం ప్రకటించింది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ తో ఏడాదిన్నరగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్నారు. అయితే ఇటీవలే ఆ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినా కనీస మద్దతు ధర చట్టం, ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం, రైతులపై పెట్టిన కేసుల కొట్టివేత వంటి డిమాండ్లతో ఇంకా సరిహద్దుల్లోనే నిరసనలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇవాళ పార్లమెంట్ లో చర్చ సందర్భంగా సరిహద్దుల్లో మరణించిన రైతులకు పరిహారం ఇస్తారా? అన్న ప్రతిపక్ష ఎంపీ ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రభుత్వం దగ్గర వివిధ కారణాలతో చనిపోయిన రైతుల వివరాలు లేవని స్పష్టం చేశారు. కాబట్టి వారికి పరిహారం ఇచ్చే సమస్యే లేదని స్పష్టం చేశారు.
నిరసనలను ఆపాలని రైతు సంఘాలను ఎప్పటి నుంచో కోరుతున్నామని, వ్యవసాయ చట్టాలపై 11 రౌండ్ల చర్చలు కూడా జరిపామని ఆయన గుర్తు చేశారు. పంటకు కనీస మద్దతు ధర చట్టం అమలు చేస్తారా? అని ప్రతిపక్ష ఎంపీ ప్రశ్నించగా 22 రకాల పంటలకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటించిందని మంత్రి సమాధానమిచ్చారు. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ సిఫార్సుల మేరకే ధరలను పెంచామని తెలిపారు.