Nari Shakti: 'మోదీ 3.0' కేబినెట్లో ఏడుగురు మహిళలకు చోటు
Nari Shakti: ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 74 మంది మహిళలు ఎంపీలుగా గెలిచారు. అయితే 2019లో ఎన్నికైన 78 మందితో పోలిస్తే ఈసారి మహిళా ఎంపీల సంఖ్య స్వల్పంగా తగ్గింది.
Nari Shakti: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడో సారి ఏర్పడిన కేంద్ర ప్రభుత్వంలో 72 మంది కేంద్ర మంత్రులున్నారు. వీరిలో ఏడుగురు మహిళలు. గతంలో ఆర్థిక, రక్షణ మంత్రిత్వ శాఖలు నిర్వహించిన రాజ్యసభ సభ్యురాలైన నిర్మలా సీతారామన్‌తోపాటు జార్ఖండ్‌లోని కోడెర్మా ఎంపీగా రెండుసార్లు గెలిచిన అన్నపూర్ణా దేవి కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గత ప్రభుత్వంలో అన్నపూర్ణా దేవి విద్యాశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.
కాగా, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మిత్రపక్షమైన అప్నా దళ్ అధినేత్రి అనుప్రియా పటేల్ కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ తొలి ప్రభుత్వంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా ఆమె పనిచేశారు. మోదీ రెండో ప్రభుత్వంలో వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆమె పార్టీ గెలిచిన ఎంపీ స్థానాల సంఖ్య రెండు నుంచి ఒకటికి పడిపోయింది. మరోవైపు 30 ఏళ్ల రక్షా ఖడ్సే మరో కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్రకు చెందిన రాజకీయ నేత ఏక్‌నాథ్ ఖడ్సే కోడలైన ఆమె రేవర్ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. గతంలో సర్పంచ్‌గా, జిల్లా పరిషత్ సభ్యురాలిగా ఆమె పనిచేశారు.
కర్ణాటక నుంచి రెండుసార్లు బీజేపీ ఎంపీగా గెలిచిన శోభా కరంద్లాజే కూడా కేంద్ర సహాయ మంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. గత ప్రభుత్వంలో కూడా ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమలు, వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖల సహాయ మంత్రిగా ఆమె ఉన్నారు. కాగా, మధ్యప్రదేశ్‌లోని ధార్ ఎంపీ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన సావిత్రి ఠాకూర్ ఆదివారం కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ మూడో ప్రభుత్వంలో తొలిసారి మంత్రి పదవిని ఆమె చేపట్టారు.
మధ్యప్రదేశ్‌లోని భావ్‌నగర్ ఎంపీగా గెలిచిన 57 ఏళ్ల నిముబెన్ భంబనియా కూడా తొలిసారి కేంద్ర సహాయ మంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ ఉపాధ్యాయురాలైన ఆమె గతంలో భావ్‌నగర్ మేయర్‌తోపాటు స్థానిక బీజేపీలో పలు పదవులు చేపట్టారు. మరోవైపు మోదీ మూడో ప్రభుత్వంలో కేంద్ర మంత్రులుగా ఏడుగురు మహిళలు ఉండగా, గత ప్రభుత్వంలో పది మంది మహిళా మంత్రులు ఉన్నారు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 74 మంది మహిళలు ఎంపీలుగా గెలిచారు. అయితే 2019లో ఎన్నికైన 78 మందితో పోలిస్తే ఈసారి మహిళా ఎంపీల సంఖ్య స్వల్పంగా తగ్గింది.