Sabarimala: శబరిమల 'అరవణ' ప్రసాదం విక్రయాలు నిలిపివేత.. కారణం ఇదే

Sabarimala: శబరిమల 'అరవణ' ప్రసాదం విక్రయాలు నిలిపివేత.. కారణం ఇదే

Update: 2023-01-12 13:00 GMT

Sabarimala: శబరిమల 'అరవణ' ప్రసాదం విక్రయాలు నిలిపివేత.. కారణం ఇదే  

Sabarimala: శబరిమల అరవణ ప్రసాదంలో వినియోగించే యాలకుల్లో మోతాదుకు మించి రసాయనాలు ఉన్నట్లు ఆహార భద్రతా, ప్రమాణ ప్రాధికార సంస్థ నివేదిక ఇచ్చింది. దీంతో ఈ ప్రసాదం విక్రయాలను నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.

శబరిమల ఆలయంలో పవిత్ర 'అరవణ ప్రసాదం' విక్రయాలు నిలిచిపోయాయి. ఈ ప్రసాదం తయారీ, అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని కేరళ హైకోర్టు బుధవారం ట్రావెన్‌కోర్‌ దేవస్వమ్‌ బోర్డు ను ఆదేశించింది. దీనిలో ఉపయోగించే యాలకుల్లో పరిమితికి మించి రసాయనాలు వినియోగించారన్న నివేదిక ఆధారంగా హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని లేకుండా తయారు చేసిన ప్రసాదం విక్రయించుకోవచ్చని న్యాయస్థానం సూచించింది.

అరవణ ప్రసాదంలో వినియోగించే యాలకులను ట్రావెన్‌కోర్ బోర్డు అంతకుముందు అయ్యప్ప స్పైసెస్‌ అనే కంపెనీ నుంచి కొనుగోలు చేసింది. అయితే, 2022-23 సీజన్‌లో ఈ యాలకుల కాంట్రాక్టును కొల్లాంకు చెందిన ఓ సప్లయర్‌కు బోర్డు అక్రమంగా అప్పగించిందని అయ్యప్ప స్పైసెస్‌ కంపెనీ ఆరోపించింది. ఈ క్రమంలోనే యాలకుల నాణ్యతపై ఈ కంపెనీ ఫిర్యాదు చేయడంతో ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్‌ ఇండియా లాబొరేటరీలో పరీక్షించారు. ఈ యాలకులు అసురక్షితమైనవిగా తేలాయి. కొల్లాం కంపెనీ సప్లయ్‌ చేసిన వాటిల్లో 14 రకాల రసాయనాలు మోతాదుకు మించి ఉన్నాయని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నివేదిక ఇచ్చింది.

అనంతరం ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన ధర్మాసనం.. ప్రసాదం విక్రయాలపై మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. "అరవణ తయారీలో వినియోగించే యాలకుల మొత్తం చాలా తక్కువే అయినప్పటికీ.. నాణ్యత లేని, అసురక్షితమైన పదార్థాలను ఉపయోగించడం సరైంది కాదు. అలాంటి వాటితో తయారైన ప్రసాదాలను బోర్డు విక్రయించకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో అరవణ ప్రసాదాన్ని భక్తులకు అమ్మకుండా ట్రావెన్‌కోర్‌ బోర్డుకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. ఎట్టిపరిస్థితుల్లోనూ దీన్ని విక్రయించకుండా ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్‌ తగిన చర్యలు తీసుకోవాలి" అని కోర్టు స్పష్టం చేసింది. దీనిపై తదుపరి విచారణను జనవరి 13వ తేదీకి వాయిదా వేసింది.

కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ ప్రసాదం విక్రయాలు నిలిచిపోయాయి. అయితే, యాలకులు లేకుండా చేసిన ప్రసాదం లేదా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోలు చేసిన యాలకులతో తయారుచేసిన ప్రసాదాన్ని విక్రయించుకోవచ్చని కోర్టు.. దేవస్థానం బోర్డును సూచించింది.

Tags:    

Similar News