Narendra Modi: 2070 నాటికి కర్బన ఉద్గార రహిత దేశంగా భారత్!
* సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యం వల్లే సాధ్యం * దీని ద్వారా భారత్‌లో 5కోట్లకు పైగా ఉద్యోగాలు
Narendra Modi: 2070 నాటికి కర్బన ఉద్గార రహిత దేశంగా భారత్ మారుతుందని ఇటీవల గ్లాస్గో వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఈ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థపై WEF కీలక అంచనా వేసింది. భారత్ తాజాగా నిర్దేశించుకున్న సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యం కారణంగా, 2070 కల్లా ఆర్థిక వ్యవస్థ 15 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని ప్రపంచ ఆర్థిక వేదిక అంచనా వేసింది.
దీంతో 5కోట్లకు పైగా కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని తాజా పరిశోధనలలో వెల్లడించింది. W.E.F విడుదల చేసిన 'మిషన్ 2070: ఏ గ్రీన్ న్యూ డీల్ ఫర్ లా నెట్ జీరో ఇండియా' నివేదిక ప్రకారం హరిత లక్ష్యాల దిశగా కార్యాచరణ ప్రారంభమైతే, 2030 కల్లా జీడీపీకి అదనంగా లక్ష కోట్ల డాలర్లు జతయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అది 2070 కల్లా 15 లక్షల కోట్ డాలర్ల వ్యవస్థగా భారత్ మారొచ్చని వెల్లడించింది.
అంతర్జాతీయ హరిత కేంద్రంగా భారత్ అవతరించాలంటే ప్రైవేటు రంగానికి ప్రోత్సాహకాలు, పరిశోధన-అభివృద్ధి 'ఆర్ అండ్ డీ' సబ్సిడీలు ఇవ్వడంతో పాటు హరిత సాంకేతిక వ్యాపార ఇంక్యుబేటర్లు, ఆర్ అండ్ డీ కేంద్రాల అభివృద్ధికి చేయూతనివ్వాలి.
వినూత్న విదేశీ వ్యాపారాలను ఆకర్షించి భారత్‌లో వాటి విస్తరణను పెంచాలి. సంప్రదాయ ఇంధనాలతో పోలిస్తే, పునరుత్పాదక ఇంధనాల కోసం మరిన్ని పెట్టుబడులు కావాలి. సిబ్బంది కూడా అధికంగా అవసరమవుతారు. దీని ద్వారా అధిక ఉద్యోగాలు వస్తాయని W.E.F విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.