Assam Floods: అస్సాంలో ఆగని వరద బీభత్సం.. 28 జిల్లాల్లో కొనసాగుతున్న వరద
*ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 135 మంది మృతి
Assam Floods: అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. 24 గంటల్లో 8 మంది మృతి చెందారు. వరదలు, కొండచరియలు కూలి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 135 మంది చనిపోయారు. ఇప్పటికీ 28 జిల్లాల్లో వరద కొనసాగుతోంది. 33 లక్షల మంది ప్రజలు వరద బారిన పడినట్టు అస్సాం అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా బార్పెట జిల్లాలో 8 లక్షల 76 వేల మంది, నాగోన్ జిల్లాలో 5 లక్షల 8వేల మంది, కామ్‌రూప్ జిల్లాలో 4 లక్షలమంది, క్యాచర్ జిల్లాలో 2 లక్షల 76 వేల మంది, కరీంగంజ్‌లో 2 లక్షల 16 వేల మంది, ధుబ్రి జిల్లాలో లక్షా 84 మంది, డర్రాంగ్ జిల్లాలో లక్షా 70 వేల మంది వరదతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. తాగునీరు, ఆహారం అందక విలవిలలాడుతున్నారు. వరద ముంపు ప్రాంతాల నుంచి 2 లక్షల మందికి పైగా 564 పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 75 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని 2వేల 542 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో భారత వైమానిక దళం ఏడు ఎయిర్‌క్రాఫ్టులను మోహరించింది. 77 టన్నుల ఆహారం, నీరు ప్రజలకు వైమానిక దళం అందజేసింది. ఐదు రోజులగా 700 టన్నుల నిత్యావసరాలను అస్సాంకు వైమానిక దళం తరలించింది. సహాయక చర్యల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్, ఆర్మీ, అస్సాం అధికారులు పాల్గొంటున్నారు. వరదలో చిక్కుకున్న ప్రజలను సురక్షితంగా తరలిస్తున్నారు. రాష్ట్రంలో వరద పరిస్థితి, సహాయక చర్యలపై సమీక్షించేందుకు సీఎం హిమంత బిస్వా శర్మ కాచర్ జిల్లాలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
తాజాగా నల్బరీ జిల్లాలోని భాంగ్నమరిలో బ్రహ్మపుత్ర నదిని ఆనుకుని ఉన్న పోలీసు స్టేషన్ వరదలో కొట్టుకుపోయింది. ఈ రెండస్తుల భవనం అందరూ చూస్తుండగానే కొద్ది క్షణాల్లోనే కూలిపోయి కొట్టుకుపోయింది. వరద ముప్పు పొంచి ఉండడంతో ముందుగానే పోలీసులు భవాన్ని ఖాళీ చేశారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇప్పుడు ఈ భవనం కూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంటే కొపిలి, బరాక్, కుషియార నదులు ఉగ్రరూపం దాల్చాయి. ప్రవాహం ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.