Gali Janardhan Reddy: రాజకీయాలపై మళ్లీ 'గాలి' మళ్లింది
Gali Janardhan Reddy: 12 ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న గాలి
Gali Janardhan Reddy: మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సారి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. బీజేపీ నుంచి కాకుండా సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న గాలి... పార్టీని స్థాపించారు. ఎన్నికల నేపథ్యంలో గాలి సొంత పార్టీ పెట్టి పోటీకి దిగుతుండటం కన్నడ రాజకీయల్లో చర్చకు దారితీసింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోరు కాంగ్రెస్, బీజేపీల మధ్యే అయినా.. చిన్న, ప్రాంతీయ పార్టీలూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. హంగ్ వస్తే తామేు కీలకంగా మారుతామని ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి. అలాంటి ఆశల నేపథ్యంలోనే కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డి స్థాపించారు.
పార్టీ చిహ్నం ఫుట్‌బాల్‌ను గాలి జనార్థన్ రెడ్డి ఆవిష్కరించారు. రాజకీయాల్లో తనను ఫుట్‌బాల్‌లా ఆడుకున్నారుంటూ గాలి వాపోయారు. బీజేపీ అధికారంలో ఉన్నా తనకు సీబీఐ వేధింపులు తప్పలేదన్నారు. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల సూచనతోనే పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు.
బళ్లారిని నమ్ముకున్న గాలి జనార్దన రెడ్డి పార్టీ తరఫున ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని 50 నియోజకవర్గాల్లో అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. ఈ ప్రాంతాభివృద్ధి కోసమే ప్రత్యేక ప్రణాళికను రూపొందించిన్నట్లు గాలి జనార్థన్ రెడ్డి తెలిపారు. బళ్లారి, విజయనగర, కొప్పళ, రాయచూరు, యాదగిరి, బీదర్‌లో గెలుస్తామన్న ధీమాతో ప్రచారం చేస్తున్నారు. 30 స్థానాల్లో గెలుపు ఖాయమని, వాటితో రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతామని గాలి భావిస్తున్నారు.
ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆవిర్భవించిన కేఆర్‌పీపీ గాలి అనుకున్న స్థాయిలో ప్రభావం చూపుతుందా..? లేదా..? అన్న ప్రచారం కర్ణాటక రాజకీయాల్లో జోరుగా జరుగుతోంది. కర్ణాటకలో కీలకమైన లింగాయత్, ఒక్కలిగ, అహిందల మద్దతు కేఆర్‌పీపీ ఉండదన్న వాదన బలంగా వినిపిస్తోంది. గాలి కర్ణాటకలో ఉన్నా వలసవాదిగానే ప్రజలు భావిస్తుంటారు. రాష్ట్ర ఫలితాలను నిర్ణయించే శక్తి ఆయన వర్గానికి అంతంత మాత్రమే అన్న అంచనాలున్నాయి.
12 ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉండటం, అక్రమ మైనింగ్‌కు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం, సీబీఐ విచారణలు గాలి మైనస్‌గా మారే అవకాశం ఉంది. కేవలం బీజేపీపై కోపం తప్ప ఆయనకంటూ సొంతంగా రాజకీయ లక్ష్యాలు లేవన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అందుకే గాలికి మద్దతుపై స్థానిక రాజకీయ వర్గాల్లోనూ అంతగా సుముఖత కనిపించటం లేదంటున్నారు.