Baba Siddique: బిష్ణోయ్ గ్యాంగ్ చేతిలో ముంబైలో హత్యకు గురైన ఈ మాజీ మంత్రి ఎవరు?

బాబా సిద్దిఖీ ముంబైలో అక్టోబర్ 12న హత్యకు గురయ్యారు. ఇందుకు తామే బాధ్యులమని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది.

Update: 2024-10-13 11:02 GMT
Baba Siddique:  బిష్ణోయ్ గ్యాంగ్ చేతిలో ముంబైలో హత్యకు గురైన ఈ మాజీ మంత్రి ఎవరు?

Baba Siddique: బిష్ణోయ్ గ్యాంగ్ చేతిలో ముంబైలో హత్యకు గురైన ఈ మాజీ మంత్రి ఎవరు?

  • whatsapp icon

బాబా సిద్దిఖీ ముంబైలో అక్టోబర్ 12న హత్యకు గురయ్యారు. ఇందుకు తామే బాధ్యులమని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు నిందితులు కూడా తాము ఇదే గ్యాంగ్ సభ్యులుగా పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. 2004-08 మధ్యకాలంలో విలాస్ రావ్ దేశ్ ముఖ్ కేబినెట్ లో సిద్దిఖీ మంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలాకాలం పనిచేసిన ఆయన ఈ ఏడాది జనవరిలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

15 రోజుల క్రితమే వై కేటగిరి భద్రత

ముంబైలోని బాంద్రాలోని తన కొడుకు కార్యాలయం వద్ద ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు సిద్దిఖీపై కాల్పులకు దిగారు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించారు.లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. హర్యానాకు చెందిన కర్నైల్ సింగ్, ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ధర్మరాజ్ కశ్యప్ అనే ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సిద్దిఖీని హత్య చేయడానికి కొన్ని నెలలుగా ప్రణాళికలు రచించారు. నిందితులు కుర్లా ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. నెలకు రూ. 14 వేలు చెల్లిస్తున్నారు. ఆటోరిక్షాలో ఘటన స్థలానికి నిందితులు చేరుకున్నారు. ఇంటి బయట టపాకాయలు కాలుస్తున్న ఆయనపై కాల్పులు జరిపారు. సిద్దిఖీకి భద్రత పెంచాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. 15 రోజుల క్రితమే ఆయనకు వై కేటగిరి భద్రత కల్పించారు. భద్రత పెంచిన తర్వాత ఈ ఘటన జరిగింది.

ఎవరీ బాబా సిద్దిఖీ?

1958 సెప్టెంబర్ 30న సిద్దిఖీ జన్మించారు. ఆయన డిగ్రీ చదువుకున్నారు. 17 ఏళ్ల వయస్సులో కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన కార్పోరేటర్ గా పలుమార్లు విజయం సాధించారు.1980 నాటికి బాంద్రా తాలుకాలో ఆయన కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా మారారు. మాజీ ఎంపీ సునీల్ దత్ కు అత్యంత సన్నిహితుల్లో ఆయన ఒకరిగా మారారు. 1999లో తొలిసారిగా బాంద్రా వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004 నుంచి 2008 మధ్య కాలంలో మహారాష్ట్రలోని విలాస్ రావ్ దేశ్ ముఖ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2014 నుంచి ముంబై కాంగ్రెస్ కమిటీకి ఉపాధ్యక్షులుగా పనిచేశారు.2000 నుంచి 2004 మధ్య కాలంలో మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మన్ గా కూడా పనిచేశారు. 2014లో బాంద్రా వెస్ట్ నుంచి పోటీ చేసి ఓడారు. సిద్దిఖీకి భార్యతో పాటు కొడుకు,కూతురున్నారు. సిద్దిఖీ కొడుకు జీషన్ ఎమ్మెల్యేగా ఉన్నారు

స్లమ్ డెవలప్ మెంట్ స్కాం ఏంటి?

మహారాష్ట్ర హౌసింగ్ డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మన్ గా 2000-04 వరకు ఆయన కొనసాగారు. ఆ సమయంలో స్లమ్ రిహాబిలిటేషన్ ప్రాజెక్టు చేపట్టారు. అయితే ఇందులో రూ. 2 వేల కోట్ల స్కాం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఈ స్కాంపై 2012లో అబ్దులా సలామ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా 2014లో సిద్దిఖీతో పాటు 150 మందిపై కేసు నమోదు చేశారు. ఇళ్ల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును దర్యాప్తు చేసిన ఈడీ అధికారులు 2018లో సిద్దిఖీకి చెందినట్టుగా చెబుతున్న రూ. 462 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. ఇదే ప్రాజెక్టు విషయంలోని విభేదాలే సిద్దిఖీ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇఫ్తార్ విందులకు సినీ సెలబ్రెటీలు

బాబా సిద్దిఖీ రంజాన్ లో ఇఫ్తార్ విందు ఇచ్చేవారు. ఈ విందులకు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యేవారు. ఈ పార్టీలకు రాజకీయనాయకులు కూడా వచ్చేవారు. ఈ ఇఫ్తార్ పార్టీలకు వచ్చిన సమయంలోనే షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించారని చెబుతారు. బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన పలువురితో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ వర్గంలో చేరారు. ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయనకు అన్ని పార్టీలతో మంచి సంబంధాలున్నాయి. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ,సంజయ్ గాంధీలతో ఆయన ప్రయాణం సాగింది. ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తన తండ్రిలాంటివారని ఆయన గతంలో ప్రకటించారు. కానీ, కొన్నిసార్లు వ్యక్తిగత జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు.

లగ్జరీ కార్లంటే ఇష్టం

ఆయనకు మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్లంటే ఇష్టం. విలాసవంతమైన కార్లు ఎక్కువగా కొనుగోలు చేస్తారని ఆయన సన్నిహితులు చెబుతారు. ఆయన వద్ద ఖరీదైన బంగారం, వజ్రాభరణాలు ఉన్నాయి. వీటి రూ. 30 కోట్లు ఉంటుందని అంచనా. బ్యాంకు డిపాజిట్లు, పలు కంపెనీల్లో పెట్టుబడులున్నాయి.

సల్మాన్ ఖాన్ కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు

బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్ ను బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్ లో ఆయన ఇంటి వద్ద కాల్పులు జరిగాయి. ఇది ట్రైలర్ మాత్రమే భవిష్యత్తులో ఇంకా చూస్తారని అప్పట్లో ఈ గ్యాంగ్ బెదిరింపులకు దిగింది.

సల్మాన్ కు బాబా సిద్దిఖీ అత్యంత సన్నిహితుడిగా ఉన్న సిద్దిఖీని బిష్ణోయ్ గ్యాంగ్ హత్య చేయడం కలకలం రేపుతోంది.

Tags:    

Similar News