Top 6 News @ 6 PM: మిగిలిన వారికి రూ. 2 లక్షల రుణాలపై మంత్రి సీతక్క క్లారిటీ

Update: 2024-10-26 13:00 GMT

1) రూ. 2లక్షల రుణం ఇంకా మాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్

రూ. 2లక్షల రుణం ఇంకా మాఫీ కాని రైతులకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు. దీపావళి తరువాత మరో 4 లక్షల మంది రైతులకు రూ. 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామని సీతక్క స్పష్టంచేశారు. ఇప్పటికే విడతల వారీగా 25 లక్షల మంది రైతులకు 2 లక్షల రూపాయల రుణం మాఫీ చేశామని మంత్రి తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడుతూ మంత్రి సీతక్క ఈ వ్యాఖ్యలు చేశారు.

2) మీ బిడ్డలపై ప్రమాణం చేస్తారా.. కన్నీళ్లు పెట్టుకున్న షర్మిళ

వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తో ఆస్తుల వివాదంపై వైఎస్ షర్మిళ మరోసారి స్పందించారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికుండగానే ఆస్తిలో నలుగురు మనవళ్లకు సమానమైన వాటా ఉందని స్పష్టంచేశారు. ఇప్పుడు అందులో తనకు వాటా లేదంటే ఎలా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ ఇచ్చిన పదవులతో వైవి సుబ్బారెడ్డి, ఆయన కుమారుడు ఆర్థికంగా లాభపడ్డారు కనుకే వాళ్లు జగన్ కి ఒత్తాసు పలుకుతున్నారని అన్నారు. తాను నిజం చెబుతున్నానని నా బిడ్డలపై ప్రమాణం చేస్తాను. మరి మీరు చెప్పేది కూడా నిజమేనని ప్రమాణం చేస్తారా చెప్పండి అంటూ వైవి సుబ్బారెడ్డికి, జగన్ కి సవాల్ చేశారు. అంతేకాదు.. జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్ అని మీరు మీ వాళ్ల పేర్లు పెట్టుకుని వ్యాపారాలు చేసినంత మాత్రాన్నే అవి మీవి కావు అని షర్మిల వ్యాఖ్యానించారు. తాను అడ్డం చెప్పలేదు కనుకే ఆ పేర్లతో వ్యాపారం చేసుకోగలిగారు అని ఆమె అభిప్రాయపడ్డారు.

3) కాంగ్రెస్ ప్రభుత్వం మరో 6 నెలల్లో పడిపోతుందన్న ఎర్రబెల్లి

మరో ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయేలా ఉందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న వర్గపోరే అందుకు కారణంగా ఎర్రబెల్లి చెప్పుకొచ్చారు. సొంత పార్టీపైనే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తంచేస్తూంటే, వారికి జగ్గారెడ్డి లాంటి వాళ్లు మద్దతిస్తున్నవారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడానికి ఇలాంటివి సరిపోవా అని ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వమే కూలిపోయే ప్రమాదంలో ఉంటే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలో పొలిటికల్ బాంబులు పేలుతాయని అనడం హాస్యాస్పదంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. జనగాం జిల్లా పాలకుర్తి పోలీసు స్టేషన్ ఎదుట జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఎర్రబెల్లి ఈ వ్యాఖ్యలు చేశారు.

4) రెండో టెస్టులో భారత్ ఓటమి.. సిరీస్ కైవసం చేసుకున్న న్యూజిలాండ్..

పూణె వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత క్రికెట్ జట్టు ఓడిపోయింది. రెండో టెస్టులో మూడు రోజుల్లోనే 113 పరుగుల తేడాతో జట్టు ఓటమిపాలైంది. భారత్‌ 359 పరుగుల టార్గెట్‌ను ఛేదించాల్సి ఉండగా 245 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో న్యూజిలాండ్ 69 ఏళ్ల తర్వాత భారత్‌లో టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారిగా టెస్టు సిరీస్ గెలిచి ఇన్నేళ్లుగా ఉన్న వెలితిని పూడ్చుకుంది. మరోవైపు భారత్ 12 ఏళ్ల తరువాత ఇండియాలో టెస్ట్ సిరీస్‌ని కోల్లోయింది.

5) ఎక్స్, మెటా వంటి సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం హెచ్చరిక

గత 2 వారాలుగా సోషల్ మీడియా ద్వారా 300 -400 విమానాలకు బాంబు బెదిరింపులు రావడంపై కేంద్రం స్పందించింది. ఎక్స్ ( గతంలో ట్విటర్ ), మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ పేరెంట్ కంపెనీ) వంటి సామాజిక మాధ్యమాల సంస్థలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఇకపై సామాజిక మాధ్యమాల్లో అలాంటి ఆకతాయి బెదిరింపులకు పాల్పడే వారిపై సామాజిక మాధ్యమాలు కఠినంగా స్పందించాల్సిందిగా సూచించింది. లేదంటే కేంద్రమే సామాజిక మాధ్యమలపై కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించింది.

6) ఇరాన్ పై కొనసాగుతున్న ఇజ్రాయెల్ మిస్సైల్ ఎటాక్

ఇరాన్ పై ఇజ్రాయెల్ మిస్సైల్స్ ఎటాక్ శనివారం కూడా కొనసాగుతూనే ఉంది. అక్టోబర్ 1 నాటి ఇరాన్ మిస్సైల్స్ దాడికి ప్రతీకారంగా తాము ఈ దాడి చేస్తున్నట్లు ఇజ్రాయెల్ స్పష్టంచేసింది. ఓవైపు ఇరాన్ పై మిస్సైల్స్ ప్రయోగిస్తూనే మరోవైపు ఇజ్రాయెల్ పౌరులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆ దేశ రక్షణ శాఖ అధికార ప్రతినిధి డానియెల్ హిగారి స్పష్టంచేశారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడిపై ఇరాన్ కూడా స్పందించింది. ఇజ్రాయెల్ మిస్సైల్స్ ఎటాక్‌ని తమ రక్షణ వ్యవస్థ సులువుగానే తిప్పికొట్టిందని ఇరాన్ ప్రకటించింది.

Tags:    

Similar News