Coronavirus: దేశవ్యాప్తంగా కరోనా స్లో డౌన్ స్టార్ట్
Coronavirus: క్రమంగా తగ్గుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య * భారత్‌లో కొత్తగా 2,76,070 కేసులు నమోదు
Coronavirus: దేశవ్యాప్తంగా కరోనా స్లో డౌన్ స్టార్ట్ అయింది. దేశంలో వైరస్ పీక్ స్టేజ్ పూర్తయి, కేసుల్లో తగ్గుదల మొదలైంది. దేశంలో వరుసగా నాలుగో రోజు కొత్త కేసులు 3 లక్షల లోపు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా కాస్త తగ్గాయి. భారత్ లో కొత్తగా 2లక్షల 76 వేలకిపై కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 3874 మంది ఈ మహమ్మారికి బలయ్యారు.
ఇక దేశంలో యాక్టీవ్ కేసులు సంఖ్య 31లక్షల 29వేల 878 గా ఉంది. ఇప్పటికి వరకు కరోనా బారిన పడి 2 లక్షల 87 వేల 122 మంది మృతి చెందారు. రికవరీ రేటు 86.23 శాతం ఉంది. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో యాక్టీవ్ కేసుల శాతం 12.66గా ఉంది. మరణాల రేటు 1.11గా ఉంది. ఇక దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 11లక్షల 66 వేలకిపై టీకా వేశారు.
దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమలవుతోంది. లాక్‌డౌన్ అమలు తర్వాత నుంచి వైరస్ ఉధృతి క్రమంగా తగ్గడం మొదలైంది. కరోనా కట్టడికి ఇది చాలా ఉపయోగపడిందని నిపుణులు చెబుతున్నారు. వారం రోజులుగా దాదాపు 18 రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం స్పల్పంగా పెరుగుదల ఉంది. వైరస్ వ్యాప్తి తగ్గుతున్నట్టు గ్రౌండ్లెవల్లో పనిచేసే డాక్టర్లు చెప్తున్నారు. తెలంగాణలో కూడా లాక్‌డౌన్ తర్వాత మరింత తగ్గొచ్చంటున్నారు. టీకా పంపిణీ సైతం.. వైర్‌సకు అడ్డుకట్ట వేయడంలో తనవంతు పాత్ర పోషించిందని, హెర్డ్ ఇమ్యూనిటీ కూడా కేసుల తగ్గుదలకు కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కొవిడ్ మహమ్మారి సెకెండ్ వేవ్‌పై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తల బృందం కొంత ఊరటనిచ్చే కబురు చెప్పింది. జులైతో దీనికి తెర పడే అవకాశాలున్నట్లు వెల్లడించింది. అలాగే 6-8 నెలల తర్వాతే వైరస్ థర్డ్ వేవ్ ఉండొచ్చని.. అయితే రెండో వేవ్ మాదిరి తీవ్ర ప్రభావం ఉండకపోవచ్చని అంచనా వేసింది. దేశంలో అక్టోబరు వరకు కరోనా మూడో ఉద్ధృతి ఉండకపోవచ్చని అగర్వాల్ తెలిపారు.